శేరిలింగంపల్లి, మార్చి 15 (నమస్తే శేరిలింగంపల్లి): ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా వాలేటివారి పాలెం మండలానికి చెందిన పి.మాల్యాద్రి బ్రతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి కూకట్‌పల్లిలోని శ్రేష్ట నివాస్‌లో ఉంటూ స్థానికంగా భవన నిర్మాణ పనులకు సంబంధించి మేస్త్రిగా జీవనం సాగిస్తున్నాడు. కాగా ఈ నెల 14వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనం (ఏపీ28సీఎల్8036)పై మియాపూర్ మయూరి నగర్ నుంచి గోకరాజు కాలేజ్ వైపు రహదారిపై ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యలో నియో లైఫ్ హాస్పిటల్ ఎదుటకు రాగానే ఓ వాటర్ ట్యాంకర్ (టీఎస్12యూడీ5673) ఎదురుగా అతి వేగంగా వచ్చి మాల్యాద్రి వాహనాన్ని ఢీకొంది. దీంతో మాల్యాద్రి తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మాల్యాద్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ట్యాంకర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.