శేరిలింగంపల్లి, మార్చి 18 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి దిశా నిర్ధేశంలో అధికారులు అభివృద్ధి, సమస్యల పరిష్కారమే ద్యేయంగా ముందుకు సాగుతున్నారని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, హఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ పరిధిలో తమ దృష్టికి ప్రజలు తీసుకువచ్చిన మంజీర పైప్ లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ పైప్ లైన్ పనులపై జీఎం, డిజిఎం ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు, బస్తి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాపాలనకు నిదర్శనం ప్రజా వాణి కార్యక్రమం అని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారని, సత్వరమే సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేస్తున్నారని అన్నారు.