శేరిలింగంపల్లి, మార్చి 12 (నమస్తే శేరిలింగంపల్లి): ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీవ్ర మనస్థాపం చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్‌లోని నెహ్రూ నగర్‌లో నివాసం ఉంటున్న మేకల నవీన్ (32) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అతని కాలుకు తీవ్ర గాయం కావడంతో అతను గత నెల రోజులుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీన ఉదయం అతని సోదరుడు, తల్లి ఇంటి నుంచి బయటకు పని నిమిత్తం వెళ్లారు. మరుసటి రోజు ఉదయం వారి బాబాయి మల్లేష్ వచ్చి తలుపు కొట్టగా ఎంతసేపు వేచి చూసినా నవీన్ తలుపు తీయలేదు. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా అతని మృతదదేహం కనిపించింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా నవీన్‌కు ఆర్థిక ఇబ్బందుల వల్లే అతను తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.