తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విషయంలో శుభవార్త చెప్పనుందా ? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎల్ఆర్ఎస్‌కు అక్టోబర్ 15వ తేదీ వరకు మాత్రమే గడువున్న సంగతి తెలిసిందే. అయితే ఆ గడువును మరో నెల రోజుల పాటు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారని తెలిసింది.
ఎల్ఆర్ఎస్‌ను ప్రకటించినప్పటి నుంచి నిజానికి కొన్ని రోజుల వరకు పెద్దగా అప్లికేషన్లు రాలేదు. కానీ రుసుం తగ్గే సరికి ఎల్ఆర్ఎస్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఇందుకు 15 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. మున్సిపాలిటీల నుంచి 11.57 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో 2.24 లక్షల దరఖాస్తులు వచ్చాయని సమాచారం. దీంతో ఎల్ఆర్ఎస్ ను ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొడిగిస్తుందని సమాచారం.
కాగా ఎల్ఆర్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే రూ.118 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఈ స్కీంలో గడువు ఎక్కువగా లేనందున చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని, అందువల్ల వారి కోసం మరో నెల రోజుల పాటు ఎల్ఆర్ఎస్ ను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేస్తుందేమోనని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు.