- 7 మంది బుకీలను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
- రూ.65వేల నగదు, పలు వస్తువులు స్వాధీనం
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ జోన్‌కు చెందిన ఎస్‌వోటీ పోలీసులు, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది, రాజస్థాన్ ఏటీఎస్ పోలీసులు సంయుక్తంగా కలిసి ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 7 మంది బుకీలను అరెస్టు చేశారు. మాదాపూర్ జోన్ ఎస్‌వోటీ, రాజస్థాన్ ఏటీఎస్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వ్యక్తులపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు సోమవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గచ్చిబౌలి పోలీసుల సహాయంతో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 7 మంది బుకీలను వారు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.65,330 నగదుతోపాటు 1 బెట్టింగ్ బోర్డ్, 4 ల్యాప్‌టాప్‌లు, 2 ట్యాబ్‌లు, 46 మొబైల్ ఫోన్లు, 6 ల్యాండ్ ఫోన్స్, 1 శాంసంగ్ టీవీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన అశోక్ కుమార్ చలాని (43) క్రికెట్ బెట్టింగ్‌కు నిర్వాహకుడిగా ఉండేవాడు. అలాగే అదే రాష్ట్రం, అదే ప్రాంతానికి చెందిన గణేష్ మాల్‌చలాని (47), సురేందర్ చలాని, శాంతిలాల్ బెయిద్ (53), బేరారామ్ పురోహిత్ (32), జైపూర్‌కు చెందిన పంకజ్ సెత్ (34), బీహార్‌కు చెందిన మనోజ్ పాస్మాన్ (35)లు గచ్చిబౌలి పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. కాగా వీరందరిలోనూ అశోక్ కుమార్ ఈ బెట్టింగ్‌లకు ముఖ్య నిర్వాహకుడిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే వీరు హైదరాబాద్, రాజస్థాన్ కేంద్రాలుగా బెట్టింగ్ నిర్వహించేవారు. అలాగే బెంగళూరు, ముంబై, ఢిల్లీలలోనూ వీరు తమ బెట్టింగ్ రాకెట్ నడిపేవారు.
కాగా నిందితులు ఆన్‌లైన్ ద్వారా ఓ బెట్టింగ్ యాప్ ఉపయోగించి ఎప్పటికప్పుడు పంటర్ల ద్వారా బెట్టింగ్ నిర్వహించేవారు. యాప్‌లోనే బెట్టింగ్ మొత్తాలను కొన్ని సార్లు ఆన్‌లైన్‌లో బదిలీ చేసేవారు. కొన్ని సార్లు నగదు పేమెంట్లు నిర్వహించేవారు. ఈ క్రమంలో వీరి బారిన పడిన యువత పెద్ద ఎత్తున డబ్బును ఐపీఎల్ బెట్టింగ్‌లో పెడుతూ భారీగా డబ్బు నష్టపోయారని పోలీసులు తెలిపారు. కాగా బెట్టింగ్ ముఠా గుట్టును రట్టు చేసిన సైబరాబాద్ ఎస్‌వోటీ అడిషనల్ డీసీపీ జి.సందీప్, మాదాపూర్ జోన్ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్ వి.సుధీర్ కుమార్, సిబ్బంది, గచ్చిబౌలి పోలీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అభినందించారు.