నమస్తే శేరిలింగంపల్లి : ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్, ఆదర్శ్ నగర్, ఓల్డ్ లింగంపల్లి విలేజ్, తార నగర్ కాలనీల్లోని పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. అనంతరం మాట్లాడుతూ నెహ్రు నగర్, ఆదర్శ్ నగర్, తార నగర్ ఓల్డ్ లింగంపల్లి విలేజ్ వాసుల విజ్ఞప్తి మేరకు ఆయా కాలనీలలో పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. రంభ టౌన్ షిప్ వెనుక ఉన్న నాలాపై కల్వర్టు నిర్మిస్తే నెహ్రు నగర్, ఆదర్శ్ నగర్ మీదుగా ప్రధాన రహదారికి ఆరంభ టౌన్ షిప్ వాసులు తక్కువ సమయంలో సులువుగా వారి గమ్యస్థానం కు చేరుకోగలుగుతారని, కాలనీ వాసులు విజ్ఞప్తి చేయగా సాధ్య సాధ్యాలను పరిశీలించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఆదర్శ్ నగర్ కాలనీ జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లింగంపల్లి విలేజ్ తార నగర్ లో చేపట్టబోయే సీసీ రోడ్డు, యూజీడీ నిర్మాణం పనుల కోసం పర్యటించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చామని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చింతకింది రవీందర్ గౌడ్, యాద గౌడ్, జయశంకర్, గోపాల్ యాదవ్, రవీంద్ర రాథోడ్, రవి యాదవ్, ఫక్రుద్దీన్, నిరూప, కాలనీ వాసులు పాల్గొన్నారు