శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రూ. 3.05 లక్షల కోట్ల బడ్జెట్‌లో రాష్ట్ర జనాభాలో 61 శాతానికి పైగా ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. ఈ వివక్షకు నిరసనగా ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ (ధర్నా చౌక్) వద్ద భారీ నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. బీసీ ఇంటిలెక్చువల్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బడ్జెట్ గణాంకాలను విశ్లేషించి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.

21 బీసీ కార్పొరేషన్లకు కేటాయించిన రూ. 4,400 కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని వారు ఆరోపించారు. ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రెండేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ. 2,060 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి రూ. 29 లక్షల కోట్ల బడ్జెట్ వ్యయం కాగా, అందులో బీసీలకు కేటాయించిన నిధుల్లో ఖర్చు చేసింది కేవలం 0.80 శాతం మాత్రమేనని వివరించారు. బీసీల రక్తమాంసాలతో తయారైన బడ్జెట్‌లో వారికే వాటా లేకపోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని బాలరాజ్ గౌడ్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుజన నాయకుడనని చెప్పుకుంటున్నారు కానీ, చేతల్లో మాత్రం ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు అని విమర్శించారు. ఫిబ్రవరి 27న జరిగే ఈ నిరసన దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ ఛైర్మన్ దుర్గయ్య గౌడ్, రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, బైరు శేఖర్ గంపుత్ర, ఎలికట్టె విజయ్ కుమార్, అంబాల నారాయణ, సింగం నాగేష్ గౌడ్, ఎర్రమాద వెంకన్న నేత, నాగభూషణం, బోయ గోపి, కర్నాటి మనోహర్, లింగేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





