శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో ఆధ్యాత్మిక చింతనతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, శేరిలింగంపల్లి అభివృద్ధికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించిన ఆలయాన్ని ప్రారంభించారు. శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో శ్రీ షిర్డి సాయినాథ, మార్కండేయ స్వామి, సంతాన నాగదేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించగా గత మూడు రోజుల నుంచి జరుగుతున్న ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఉదయం నుంచే రిత్వికుల మంత్రోచ్ఛారణల నడుమ యజ్ఞశాలలో హోమాలు నిర్వహించారు. పలు పూజా క్రతువులను పూర్తి చేసిన రుత్వికులు ప్రధాన ఆలయాలతో పాటు ఉపాలయాల గోపురాలపై కలశ ప్రతిష్ట చేపట్టారు. అనంతరం శ్రీ షిర్డి సాయినాథ, మార్కండేయ స్వామి, సంతాన నాగదేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవతల పాదాల వద్ద బీజాక్షర బంగారు యంత్రాన్ని ఉంచడంతోపాటు పీఠంపై విగ్రహాలను ప్రతిష్టించారు.

యజ్ఞశాలలో పలు పూజా క్రతువులు నిర్వహించిన వేద పండితులు కలశాల ద్వారా దేవుళ్లకు ప్రాణ ప్రతిష్ట చేశారు. అనంతరం వివిధ కార్యక్రమాలు నిర్వహించి అలంకరణ పూర్తి చేసి సాధారణ భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. ఉత్సవాలను తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంతత లభిస్తుందని ప్రతి ఒక్కరు దైవచింతన అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ చారిత్రాత్మక వేడుక మన సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంకేతంగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






