నమస్తే శేరిలింగంపల్లి: స్వాతంత్య్రానంతరం భారత దేశానికి చరిత్రలోనే మొట్టమొదటి సారిగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఓ మహిళకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టం, అమ్‌రోహా జిల్లా భావన్‌ఖేడి గ్రామానికి చెందిన షబ్నమ్ అలి భూగోళశాస్ర్తం, ఇంగ్లీషు భాషలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండేది. తన ఇంటి సమీపంలో కట్టెల మెషీన్ నడిపే సలీంను ప్రేమించిగా వారి వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకారం తెలుపలేదు. దీంతో కుటుంబ సభ్యులను హతమార్చేందుకు ప్రియుడు సలీంతో కలిసి 2008 సంవత్సరంలో పాలల్లో మత్తుమందు కలిపి, వారంతా నిద్రలోకి జారుకోగానే గొడ్డలితో నరికి కిరాతకంగా హతమార్చారు.
మృతుల్లో షబ్నమ్ తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు, వారి భార్యలతో పాటు 10 నెలల చిన్నారి కూడా ఉన్నారు. 12 సంత్సరాల అనంతరం స్థానిక న్యాయస్థానం షబ్నమ్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో షబ్నమ్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినప్పటికీ అదే తీర్పు పునరావృతమయ్యింది. చివరగా రాష్ట్రపతికి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోగా రాష్ర్టపతి నిరాకరించడంతో ఉరిశిక్ష ఖరారైంది. కాగా షబ్నమ్ ఉరిశిక్షకు మథుర జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.