నమస్తే శేరిలింగంపల్లి: ఆజాద్ కా అమృత మహోత్సవ లో భాగంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ప్రారంభించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాద్ కా అమృత మహోత్సవ లో భాగంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలన్నారు. నేతాజీ నగర్ కాలనీ లోని ప్రజలందరూ ఈ నెల 13 నుండి 15 వరకు తమ ఇంటి పైన జాతీయ జెండాను ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తమ విధిగా భావిస్తూ దేశం పట్ల ఉన్న గౌరవాన్ని చాటిచెప్పాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థ నాయకత్వం వల్ల ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూస్తున్నాయని, భారతదేశాన్ని విశ్వగురు చేయడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ముందుకు సాగుతున్నారని చెప్పారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశ హితమే ప్రథమ ప్రాధాన్యంగా, పార్టీ రెండో ప్రాధాన్యంగా, వ్యక్తిగత జీవితం చివరి ప్రాధాన్యంగా జీవిస్తారని, కార్యకర్తలు ఏమి ఆశించకుండా సమాజ హితమే లక్ష్యంగా పనిచేస్తారని పేర్కొన్నారు. నేతాజీ నగర్ కాలనీలో ఆజాద్ కా అమృత మహోత్సవ కార్యక్రమంలో ప్రతి భారతీయుడు గర్వంగా భారత త్రివర్ణ పతాకం జెండాను ఎగరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, రవి సింగ్ నాయక్, లక్ష్మారెడ్డి, అన్నదొర, శంకర్, పోలీస్ వాజిత్, నేతాజీ నగర్ కాలనీ పెద్దలు మహిళలు, యువజన నాయకులు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.