నమస్తే శేరిలింగంపల్లి: ఎంతో మంది మహానీయుల త్యాగాల ద్వారా సాధించుకున్న స్వతంత్ర భారతాన్ని సగర్వంగా నిలుపుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యం అని ప్రభుత్వ విప్ గాంధీ గారు అన్నారు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ మున్సిపల్ కార్యాలయం నుండి పీజేఆర్ స్టేడియం వరకు నిర్వహించిన వజ్రోత్సవ ర్యాలీని కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరత మాత దాస్య శృంఖలాలను తెంచి, బ్రిటీష్ వలస పాలనను పారదోలాలనే మహా సంకల్పంతో భారత స్వాతంత్ర్య సమరంలో భాగంగా ‘డు ఆర్ డై’ అనే నినాదంతో మహాత్మాగాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా మహోద్యమాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎంతటి విలువైనవో నేటి యువత తెలుసుకోవాలన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నాటి అమరుల త్యాగాలను పదిహేనురోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా నివాళులర్పిస్తూ స్మరించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీధర్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఓ.వెంకటేష్, పులిపాటి నాగరాజు, నరేందర్ బల్లా, కార్తిక్ గౌడ్, హరీష్ రెడ్డి, అమిత్ దుబే, కుమార్, సికేందర్, అఫ్సర్, రాజశేఖర్ రెడ్డి, దీక్షిత్ రెడ్డి, వెంకటేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.