బరితెగిస్తున్న సైబర్ నేరగాళ్లు… ఏకంగా పోలీసు అధికారి పేరుతో వసూళ్లు…

నమస్తే శేరిలింగంపల్లి: మన స్నేహితులో, బంధువులో అత్యవసరానికి చేబదులుగా డబ్బులు అడిగితే మనం ఏం చేస్తాం..? మన స్థాయిని బట్టి అడిగినంత కాకపోయినా ఎంతో కొంత సర్దుతాం. మరీ కావలసిన వారు అత్యవసర స్థితిలో ఉంటే అప్పు చేసైనా సహాయం చేస్తాం. మనిషికి మనిషే సాయం అని నమ్మే మధ్య తరగతి మనస్తత్వాలు ఎక్కువగా ఉండే సమాజం మనది. అదే మన పై స్థాయి అధికారి గానీ, మరెవరైనా ఉన్నత స్థాయి వ్యక్తులు నోరు తెరిచి డబ్బులు అడిగితే వారి మీద గౌరవంతో, భయంతోనో ఏమీ ఆలోచించకుండా వారు అడిగిన డబ్బును అందిస్తాం. ఈ విషయాన్నే తమకు అనుకూలంగా మలచుకుంటున్న కొందరు వ్యక్తులు ఫేస్‌బుక్‌లో మన వివరాలతో నకిలీ ఖాతాలను సృష్టించి అత్యవసరమంటూ మన స్నేహితులు, బంధువులను డబ్బులు అడుగుతున్నారు.

ఇటువంటి సైబర్ నేరగాళ్లు ఎక్కువగా తాము నివ‌సించే రాష్ట్రాల‌ను వ‌దిలి ఇత‌ర రాష్ట్రాల వారిని టార్గెట్ చేస్తుంటారు. జ‌రిగే మోసాలు సైతం చిన్న‌మొత్తాల్లో ఉండ‌టంతో బాధితులు అధిక వ్య‌య ప్ర‌యాస‌ల ‌కార‌ణంగా కేసుల‌ను సీరియస్‌గా తీసుకోకుండా వ‌దిలేస్తున్నారు. ఇటువంటి సంద‌ర్భాల్లో సైబ‌ర్ క్రైమ్ పోర్ట‌ల్‌లో ఫిర్యాదు చేయ‌డం ద్వారా పోలీసులు న‌కిలీ ఖాతాల‌ను సామాజిక మాధ్య‌మాల నుండి తొలగించడమే తప్ప నిందితులపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు చాలా తక్కువ. ఇదే అదునుగా భావిస్తున్న నేరగాళ్లు మరింతగా బరితెగిస్తున్నారు. ఈ మధ్య నగరంలోని ఓ విద్యాల‌య‌ అధిపతి పేరిట రూపొందించిన నకిలీ ఖాతాతో సదరు విద్య సంస్థలో పని చేసే ఉద్యోగుల నుండి వేలాది రూపాయలు వసూలు చేశారు ఈ మాయగాళ్ళు. ఇప్పుడు ఏకంగా మాదాపూర్ ఎస్‌హెచ్ఓ పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచారు. అంత‌టితో ఆగకుండా స‌ద‌రు ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ ద్వారా వాట్సాప్ నెంబ‌ర్ సేక‌రించి డ‌బ్బులు అడుతున్న విశ‌షం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాదాపూర్ ఇన్‌స్పెక్ట‌ర్ ర‌వీంద్ర ప్ర‌సాద్‌ సూచిస్తున్నారు. నకిలీ ఖాతాల మోసగాళ్ల వివరమేంటో ఎలా మోసాగిస్తున్నారో తెలుసుకుందాం…


అచ్చం మన ఖాతాను పొలినట్లుగా…
ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరి వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకంగా మారిపోయింది. వ్యక్తులు ఎం చేస్తారు, ఎక్కడ ఉంటారు, వారి వివరాలు అన్ని కూర్చున్న చోటే సేకరించవచ్చు. ఈ సమాచారంతో పాటు ఖాతాలో మనం పోస్ట్ చేసిన ఫోటోలను సేకరిస్తున్న మోసగాళ్ళు అచ్చం మన ఖాతాలను పోలిన నకిలీ ఖాతాలను రూపొందిస్తున్నారు. మన స్నేహితుల జాబితాలో ఉండే వ్యక్తులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపిస్తున్నారు. నకిలీ ఖాతాలో 50 నుండి 100 మంది స్నేహితులు చేరగానే వారి అసలు పని మొదలవుతుంది. ఫ్రెండ్ రిక్వెస్ట్ అనుమతించిన వారందరికీ మెస్సెంజర్ ద్వారా మనం మాట్లాడుతున్నట్లుగా సందేశాలు పంపి కుశల ప్రశ్నలు అడుగుతారు. అవతలి వారితో నమ్మబలికి తాము ఆసుపత్రిలో ఉన్నామని అత్యవసరంగా కొంత నగదు సాయం కావాలని అడుగుతారు. డబ్బు పంపేందుకు అంగీకరించిన వారికి వారి ఫోన్ నెంబర్ పంపి ఆ నెంబరుకు డిజిటల్ చెల్లింపు యాప్ ల ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని కోరతారు. డ‌బ్బులు అడిగేది త‌మ స్నేహితులే అని నమ్ముతున్న వ్య‌క్తులు నేర‌గాళ్లు పంపే ఫోన్ నెంబ‌ర్ల‌కు డ‌బ్బులు పంపి మోస‌పోతున్నారు. ఇప్పుడు ఈ మాయగాళ్లు మరో అడుగు ముందుకేసి ప్రజలను మరింత సులువుగా మోసగించేందుకు వాట్సాప్ చాటింగ్ యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఈ పద్దతిలో నేరగాళ్లు ఉపయోగించే నెంబరుపై వాట్సాప్ లో ఖాతా తెరిచి దాని ప్రోఫైల్ ఫొటోలో వారు ఎంచుకున్న వ్యక్తుల ఫోటోలు ఉంచుతున్నారు. సదరు వ్యక్తి ఫేస్ బుక్ ఖాతా ద్వారా వారి స్నేహితుల జాబితాలోని వ్యక్తుల నెంబర్లను సేకరిస్తున్నారు. మెసెంజర్ మాదిరిగానే వాట్సాప్ లో సందేశాలను పంపి పైన చెప్పిన విధంగానే డబ్బులు అడిగి మోసగిస్తున్నారు.

అప్ర‌మ‌త్త‌తోనే నేరాల‌ను అరిక‌ట్ట‌గ‌లం…

  • రోజురోజుకూ సైబ‌ర్ నేరాలు పెరిగిపోతున్న త‌రుణంలో నేరాల పట్ల అవగాహన కలిగిఉండి జాగ్రత్తగా ఉండటమే ఉత్తమమని పోలీసులు సూచిస్తున్నారు.
  • సైబర్ నేరాల గురించి కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్ద చర్చించి అవగాహన కల్పించాలి.
  • సామాజిక మాధ్య‌మాల‌లో వీలైనంత వ‌ర‌కూ వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని ఉంచ‌క‌పోవ‌డ‌మే మంచిది.
  • మ‌న వివ‌రాలు, ఫోటోల‌ను కేవ‌లం స్నేహితులు, బంధువులు మాత్ర‌మే చూసేలా ప్రైవ‌సీ సెట్టింగులు చేసుకోవాలి.
  • మ‌న ప్ర‌మేయం లేకుండా మ‌న వివ‌రాలతో ఏవైనా న‌కిలీ ఖాతాలు ఉన్నాయో చూసుకోవాలి. ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ లను ఆమోదించే ముందు ఖాతాలను నిశితంగా పరిశీలించాలి.
  • మన పేరుతో నకిలీ ఖాతాను గుర్తించిన వెంటనే కనీసం 15-20 మంది స్నేహితులతో ఫేస్బుక్ సపోర్ట్ టీం కు ఫేక్ ప్రొఫైల్ అని రిపోర్ట్ చేయించడం ద్వారా నకిలీ ఖాతాలను బ్లాక్ చేయించవచ్చు.
  • ప‌రిచ‌యం లేని వ్య‌క్తులతో ఆన్‌లైన్ లావాదేవిలు చేసేముందు వివ‌రాలు ఒక‌టికి రెండు సార్లు స‌రిచూసుకోవాలి.
  • ల‌క్కీ డ్రాలో డ‌బ్బు గెలుచుకున్నార‌ని క్యూఆర్ కోడ్ పంపేవారు, ఏవైనా సాఫ్ట్ వేర్ లు ఫోన్‌లో ఇన్స్టాల్ చేయ‌మ‌ని చెప్పే అప‌రిచిత వ్య‌క్తుల మాట‌లు అస్స‌లు న‌మ్మ‌వ‌ద్దు.
  • బ్యాంకు ఖాతా, డెబిట్‌, క్రెడిట్ కార్డు వివ‌రాలు, ఓటిపి నెంబ‌ర్లు, ఖాతా పాస్‌వ‌ర్డులు ఎవ్వ‌రికీ తెలియ‌జేయ‌కూడ‌దు.
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here