- నాయకుల మధ్య సమన్వయ లోపం… అయోమయంలో క్యాడర్…
- రేషన్ కార్డుల జారీపై తహసిల్దార్‌కు వేర్వేరుగా వినతి పత్రాలు
తెలంగాణ రాష్ట్రంలో కొత్త నాయకుల చేరికతో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా బిజేపి ఎదుగుతోంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన అనుచరులతో పార్టీలో చేరికతో మరికొందరు నేతలు సైతం కాషాయ కండువా కప్పునేందుకు ఆసక్తి చూపుతున్నారని చర్చ జరుగుతుంది. సాంప్రదాయ పార్టిగా ఖ్యాతిగాంచిన బిజెపి సైతం ఇటీవలి కాలంలో రాజకీయంగా పావులు కదుపుతుండటం విశేషం. పరిస్థితులకు అనుకూలంగా ఇతర పార్టీల నాయకులను కలుపుకుంటూ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అడుగులు వేస్తుంది. ఐతే ఏ రాజకీయ పార్టీలోనైనా యేళ్లతరబడి పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు, కొత్తగా చేరిన ఇతర పార్టీల నాయకులకు మధ్య సఖ్యత కుదరక వర్గాలుగా ఏర్పడటం సహజమే. ఆదిపత్యంతోనో, అవగాహనా లోపంతోనో నాయకులు చేస్తున్న పొరపాట్లు శేరిలింగంపల్లి బిజెపిలో వర్గపోరుకు ఆజ్యం పోసేలా కనిపిస్తున్నాయి. బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చిన ఒకే కార్యక్రమాన్ని, ఒకే చోట రెండు గ్రూపులు వేర్వేరుగా నిర్వహించడం స్థానికంగ చర్చకు దారితీస్తుంది.

రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పథకం ద్వారా వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలనే డిమాండ్‌తో తహసీల్ధార్లకు వినతీ పత్రాలు అందజేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం శేరిలింగంపల్లికి చెందిన బిజెపి రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు డిప్యూటీ తహసిల్దార్ నరేష్‌కు వినతి పత్రం అందజేశారు. శేరిలింగంపల్లిలోని అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డులను వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బిజెపి రాష్ట్రనాయకుడు రవికుమార్‌యాదవ్ తన అనుచరగణంతో కలిసి రేషన్ కార్డుల జారీపై తహసిల్ధార్‌కు మరోక వినతిపత్రం సమర్పించారు. ఒకే కార్యాలయంలో రెండో వినతీ పత్రంపై రవికుమార్‌యాదవ్‌ను నమస్తే శేరిలింగంపల్లి వివరణ కోరగా అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంపై తమకు సరైన సమాచారం అందలేదని అన్నారు. ఐనప్పటికి వినతిపత్రం సమర్పించేందుకు తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లామని, అప్పటికే తమ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేసి వెళ్లినట్లు తెలిసిందన్నారు. పెద్దమొత్తంలో వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు నొచ్చుకోవద్దని మరో వినతిపత్రాన్ని ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఇదంతా కేవలం సమన్వయం లోపించిన కారణంగానే జరిగింది తప్ప తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని స్పష్టం చేశారు.

కారణాలు ఏమైనప్పటికి ఒకే కార్యక్రమాన్ని ఒకే చోట వేర్వేరుగా జరపడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. ఏదేమైన శేరిలింగంపల్లిలోని పలువురు ముఖ్య నాయకుల మధ్య సమన్వయ లోపం, కొందరు నాయకుల వ్యవహార తీరు కార్యకర్తలను, పార్టీ మద్దతుదారులను అయోమయానికి గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకుంటున్న బిజెపిలో స్థానికంగా ఇలాంటి చర్యలు పార్టీ పటిష్టతకు భంగం కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్టీ హైకమాండ్ సరైన దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పార్టీకి భారీ నష్టం తప్పదని కిందిస్థాయి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యోగానంద్ కనిపించడం లేదు. ఆయన ఒక కొత్త సొంత టీం ఏర్పాటులో బిజీ గా ఉన్నారు. కసిరెడ్డి కూడా ఎలక్షన్స్ టైంలో ఆక్టివేట్ ఐతారు. ఫైనల్గా బీజేపీ TRS కాండిడేట్ ని గెలిపించటం ఖాయం !