మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కోడి పందేలు కొనసాగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు స్థావరాలపై దాడులు చేసి 7 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. ఎస్ఐ రవికిరణ్ తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్ జనప్రియ వెస్ట్ సిటీలో ఉత్తరం దిక్కున ఉన్న ఓపెన్ ప్లేస్‌లో కోడి పందేలు కొనసాగుతున్నాయని కూకట్‌పల్లి డివిజన్ ఏసీపీకి సమాచారం అందింది. దీంతో పోలీసులు పందాలు కొనసాగుతున్న స్థావరంపై ఆకస్మిక దాడులు చేశారు. పోలీసులను చూసి నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులు వారిని చేజ్ చేసి మరీ పట్టుకున్నారు.
ఈ దాడుల్లో అమీన్‌పూర్ శ్రావణి నగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి గరివెల్లి జీవన్ కుమార్ (49), మియాపూర్ జేపీఎన్ నగర్‌కు చెందిన వాచ్‌మన్ ఎల్లబోయిన త్రిమూర్తులు, హెచ్ఎంటీ కాలనీకి చెందిన వ్యాపారి వల్లభనేని రమేష్ (52), హెచ్ఎంటీకి చెందిన కార్ డ్రైవర్ కందేటి సీతారాం (21), ఎస్ఎంఎల్ వెనుక వైపు నివాసం ఉండే మల్లేష్ (24), బాలాజీనగర్‌లో నివాసం ఉండే ఆశిష్ కుమార్, అదే ప్రాంతానికి చెందిన ఉమా మహేశ్వర్ రావు (42) అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4 కోడి పుంజులు, 8 ఫోన్లు, రూ.25,500 నగదు, టీఎస్10ఇజి0875 అనే నంబరు గల ఓ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.