శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్33లో ఉన్న చిన్న పెద్ద చెరువులో హెచ్ఎండిఎ నుంచి వస్తున్న సెవెరేజ్ మురుగునీరు కలవడంతో చెరువులోని చేపలు మృత్యువాత పడుతున్నాయని గోపనపల్లి ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ శంకరి రాజు ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గోపన్ పల్లిలోని చిన్న పెద్ద చెరువులో చేపల పెంపకం చేపట్టి మత్స్య కారులు జీవనోపాధిని పొందుతున్నారని, గత కొంతకాలంగా హెచ్ఎండిఎ సెవెరేజ్ మురుగునీటిని నేరుగా చెరువులో వదులుతుండటంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకూ 25 కింటల్ చేపలు మృత్యు వాత పడ్డాయాని పలుమార్లు హెచ్ఎండిఎ , హెచ్ఎండబ్లు ఎస్ బి అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని, తద్వారా చెరువులో చేరుతున్న డ్రైనేజీ వ్యర్ధాలతో వేలాదిగా చేపలు చనిపోతున్నాయని వాపోయారు. మత్స్య కారులకు జీవనాధారమైన చేపలు మృతి చెందడం వల్ల మత్స్య కారుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సెవెరెజ్ మురుగునీరు చెరువులో కలవకుండా పైప్ లైన్ ను ఏర్పాటు చేసి అలుగు ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేయాలని కోరారు.