అధిష్టానం వ్యూహాలతో వెనక్కి తగ్గిన రె”బుల్స్”

  • అలక వీడిన శేరిలింగంపల్లి టిఆర్ఎస్ రెబెల్ అభ్యర్థులు
  • కొనసాగుతున్న నామినేషన్ల ఉపసంహరణ

నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయం సాధించాలనే సంకల్పంతో అధికార టిఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. పార్టీ లో చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ ఒక్క కార్యకర్తను కూడా బయటకు వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే శేరిలింనంపల్లి నియోజకవర్గంలో పార్టీ టిక్కెట్లు ఆశించి భంగపాటుకు గురైన నాయకులను బుజ్జగించేందుకు రాష్ట్ర నాయకులు అనుసరించిన వ్యూహాలు సత్ఫలితాలనిస్తున్నాయి. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన రోజునుండే అలకపాన్పు ఎక్కిన ఆశావహులను బుజ్జగించేందుకు అధినాయకత్వం వడివడిగా అడుగులు వేసి విజయం సాధిస్తోంది. రెబెల్ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారిని పోటీ నుండి తప్పించి తిరిగి పార్టీతో కలిసి పని చేసేలా ఒప్పించి ఎన్నికల ప్రథమ అధ్యాయంలో సక్సెస్ అయ్యారు టిఆర్ఎస్ నేతలు.

పార్టీ తో ఎలాంటి విబేధాలు లేవు: నవతా రెడ్డి

నవతరెడ్డి తో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ రంజిత్ రెడ్డి

చందానగర్ డివిజన్ నుండి గత ఎన్నికల్లో కార్పొరేటర్ గా విజయం సాధించిన బొబ్బ నవత రెడ్డి ఈ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో పార్టీ రెబెల్ గా నామినేషన్ దాఖలు చేశారు. డివిజన్ లో పార్టీని పటిష్టం చేయడంతో పాటు ప్రజల మన్ననలు పొందిన తనకు టికెట్ ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నవత రెడ్డి కచ్చితంగా బరిలో ఉంటానని శపథం చేశారు. దీంతో రంగంలో దిగిన ఎంపీలు రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత లు నవతా రెడ్డి ఇంటికి చేరుకొని బుజ్జగించారు. పార్టీలో సముచిత స్థానం లభించేలా హామీ ఇవ్వడంతో ఆమె తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంగా నవతా రెడ్డి మాట్లాడుతూ అధిష్టానం తో మాకు ఎటువంటి విబేధాలు లేవని, కొన్ని సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీకి అనుకూలంగా వ్యవహరించకపోవడం వల్లే తమకు టికెట్ రాకుండా అడ్డుపడ్డాడని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ పై తమకు నమ్మకం ఉందని, భవిష్యత్తులో తమకు ఇచ్చిన హామీలకు న్యాయం చేస్తారని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు. తాము కేసీఆర్ సైనికులమని, డివిజన్ లో పార్టీ గెలుపుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.

బాలింగ్ గౌతమ్ గౌడ్ కు కేటీఆర్ భరోసా..

మంత్రి కేటీఆర్ తో మాట్లాడుతున్న బాలింగ్ గౌతమ్ గౌడ్.

హఫీజ్ పేట్ డివిజన్ నుండి పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ కు కేటీఆర్ భరోసా ఇచ్చారు. అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే అలకబూనిన గౌతమ్ గౌడ్ ను బుజ్జగించేందుకు రాష్ట్ర నాయకులు ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ, ఎమ్మెల్సీ పట్నం మాహేందర్ రెడ్డి, డివిజన్ ఎన్నికల ఇంచార్జి నాగేందర్ గౌడ్ లతో పాటూ మాదాపూర్ డివిజన్ అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ లు రంగంలో దిగి సముదాయించే ప్రయత్నం చేశారు. రెండు రోజుల పాటు చర్చలు జరిపి పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామనే హామీ ఇచ్చినా పట్టువీడకపోవడం తో చివరగా ఎంపీ రంజిత్ రెడ్డి కేటీఆర్ తో మాట్లాడించి స్పష్టమైన హామీ ఇవ్వడంతో అలక వీడారు. పార్టీ విజయానికి కృషి చేస్తానని గౌతమ్ గౌడ్ ప్రకటించారు.

సాయిబాబా గెలుపుకు కృషి చేస్తా: నీరుడి గణేష్

గచ్చిబౌలి రెబెల్ నీరుడి గణేష్ తో సంప్రదింపులు జరుపుతున్నడివిజన్ ఎన్నికల ఇంచార్జ్ కడియం శ్రీహరి

గచ్చిబౌలి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి, రెబల్ గా నామినేషన్ దాఖలు చేసిన గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు, గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ నిరుడి గణేష్ ముదిరాజ్ తో గచ్చిబౌలి డివిజన్ ఎన్నికల ఇంచార్జ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్ అరెకపుడి గాంధీ చేసిన చర్చలు ఫలించాయి. అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి గెలుపు కోసం పనిచేసే విధంగా వారు ఒప్పించారు. ఎన్నికల అనంతరం కచ్చితమైన పదవి వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో డివిజన్ అభ్యర్థి సాయిబాబా గెలుపుకోసం కృషి చేస్తానని నీరుడి గణేష్ తెలిపారు.

కలిసి వచ్చిన కిరణ్ యాదవ్…

కిరణ్ యాదవ్ తో సంప్రదింపులు జరుపుతున్న ఎంపీ నామానాగేశ్వర్ రావు, బండి రమేష్ లు

మియాపూర్ డివిజన్ నుండి రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బిఎస్ఎన్ కిరణ్ యాదవ్ తో ఎంపీ నామా నాగేశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ లు చర్చలు జరిపారు. ఎన్నికల బరి నుండి తప్పుకుని పార్టీ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ గెలుపు కోసం పనిచేసేలా నచ్చజెప్పారు. త్వరలోనే పార్టీలో తగిన గుర్తింపు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కిరణ్ యాదవ్ అంగీకరించి నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

పార్టీ అభ్యర్థి రాగంకు మద్దతు తెలిపిన కలివేముల వీరేశం గౌడ్…

కలివేముల మనోహర్ తో సమావేశమైన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్ లు

శేరిలింగంపల్లి డివిజన్ నుండి టిఆర్ఎస్ రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఉద్యమకారుడు కలివేముల వీరేశం గౌడ్ పార్టీ నిర్ణయాన్ని గౌరవించారు. ఎన్నికలలో డివిజన్ ఇంఛార్జ్, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కార్పోరేటర్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ లు వీరేశం గౌడ్ ఇంటికి వచ్చి నచ్చజెప్పారు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అభ్యర్థిగా రాగం నాగేందర్ యాదవ్ ను ప్రకటించారని, పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని కోరారు. దీంతో పార్టీ పెద్దల సూచన మేరకు తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడానికి వీరేశం గౌడ్ అంగీకరించారు. శేరిలింగంపల్లి డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తామని వీరేశం గౌడ్ తెలిపారు.

అధిష్టానం నిర్ణయానికి తలొగ్గిన రవి యాదవ్…

రవి యాదవ్ తో సమావేశమైన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్ లు

శేరిలింగంపల్లి డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు రాజు యాదవ్ సోదరుడు రవియాదవ్ అధిష్టానం నిర్ణయానికి తలొగ్గారు. రవి యాదవ్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం తో ఎన్నికల ఇంచార్జ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, పార్టీ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ లు రవి యాదవ్ తో సంప్రదింపులు జరిపారు. భవిష్యత్ లో నామినేటెడ్ పదవి వచ్చేలా హామీ ఇవ్వడంతో రవి యాదవ్ నామినేషన్ ఉపసంహరించుకునేందుకు అంగీకరించారు. ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని రవి యాదవ్ పేర్కొన్నారు.

పెద్దల మాటపై గౌరవం ఉంది: ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్

ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ లు

మాదాపూర్ డివిజన్ నుండి టిఆర్ఎస్ టికెట్ ఆశించి, అభ్యర్థుల ప్రకటన అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన స్థానిక టిఆర్ఎస్ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ పార్టీ తో కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రబుత్వ విప్ గాంధీ లు శ్రీనివాస్ యాదవ్ నివాసానికి చేరుకొని చర్చించారు. మాదాపూర్ కార్యకర్తల సమక్షంలో శ్రీనివాస్ యాదవ్ కు స్పోర్ట్స్ విభాగంలో నామినేటెడ్ పదవి వచ్చేలా హామీ ఇవ్వడంతో పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ గెలుపుకు కృషి చేస్తానని శ్రీనివాస్ యాదవ్ మాట ఇచ్చారు.

లక్ష్మీబాయి తో కొనసాగుతున్న చర్చలు…

లక్ష్మీబాయి అల్లుడు రామారావు తో చర్చలు జరుపుతున్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

వివేకానంద నగర్ సిట్టింగ్ కార్పొరేటర్ లక్ష్మీబాయికి అధిష్టానం టికెట్ కేటాయించకపోవడం తో అలకబూనారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి లక్ష్మీబాయి ఇంటికి చేరుకొని ఆమె అల్లుడు రామారావు తో సంప్రదింపులు జరిపారు. పార్టీ అభ్యర్థి మాధవరం రోజా రంగారావుకు మద్దతు తెలపాలని కోరగా వారు ససేమీరా అంటున్నారు. టికెట్ కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసారు. స్పష్టమైన హామీ దొరికే వరకు తమ నిర్ణయాన్ని ప్రకటించబోమని తెలిపారు.

ఉద్యమకారులకు విలువ లేదు: సిందం శ్రీకాంత్

మద్దతుదారులతో సమావేశమైన హైదర్ నగర్ రెబెల్ అభ్యర్ధి చిందం శ్రీకాంత్

టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు విలువ లేకుండా పోయిందని టిఆర్ఎస్ హైదర్ నగర్ రెబెల్ అభ్యర్థి సిందం శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల బరి నుండి తప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన అనంతరం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో ఉద్యమకారులకు స్థానం కల్పిస్తామని కేటీఆర్ మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో సైతం ఉద్యమ కారులకు అవకాశం కల్పించకుండా మోడిచెయ్యి చూపారని ఆరోపించారు. టిఆర్ఎస్ పెద్దలు నామినేషన్ ఉపసంహరించుకునేందుకు ఒత్తిడి తీసుకు వస్తున్నారని, అయినప్పటికీ స్థానిక ఉద్యమకారులు, అభిమానుల కోరిక మేరకు పోటీలోనే కొనసాగనున్నట్లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here