చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): దాంపత్యంలో నెలకొన్న గొడవల కారణంగా ఓ మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైంది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని చందానగర్ పాపిరెడ్డి కాలనీలోని బ్లాక్ నం.11 రూమ్ నం.22లో నివాసం ఉండే అల్లంపాక లలిత జీహెచ్ఎంసీలో కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. ఆరేళ్ల కిందట రెండో కుమార్తె భాగ్యకు, ఎ.రాజు అనే వ్యక్తికి వివాహం జరిపించారు. వారికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం కలిగారు. కాగా ఈ నెల 17వ తేదీన ఉదయం 6 గంటల సమయంలో భాగ్య ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కోసం చుట్టు పక్కల, తెలిసిన వారి వద్ద, బంధువుల ఇండ్లలో విచారించినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా భాగ్యకు, రాజుకు గతంలో గొడవలు జరిగాయని, దీంతో పెద్దలు ఇద్దరికీ రాజీ కుదిర్చారని, అయితే గొడవలు మళ్లీ యథాతథంగా జరుగుతుండడంతో మనస్థాపానికి గురైన భాగ్య ఇంటి నుంచి బయటకు వెళ్లి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.