కొండాపూర్ డివిజన్ పై జెండా పాతేదెవరు…?

  • హైటెక్ డివిజన్ లో హోరాహోరీ పోరు
  • పోటా పోటీ ప్రచారంలో టిఆర్ఎస్, బీజేపీ నాయకులు
  • మాస్, మైనారిటీ ఓటర్లదే ప్రధాన పాత్ర
  • గెలుపోటములను ప్రభావితం చేయనున్న కాంగ్రెస్ ఓట్లు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో హైటెక్ డివిజన్ గా పేరుగాంచిన కొండాపూర్ డివిజన్ సైతం గచ్చిబౌలి మాదిరిగానే అటు క్లాస్ ఓటర్లు, ఇటు మాస్ ఓటర్ల ను కలుపుకుని ఉంది. అయినప్పటికీ ఎన్నికల్లో మాత్రం మాస్ ఓటర్లతో పాటు మైనారిటీ ఓటర్లే ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ డివిజన్ లో ప్రధాన ప్రాంతాలుగా కొండాపూర్, శ్రీరామ్ నగర్ కాలనీ, ప్రేమ్ నగర్, మార్తాండ నగర్, సిద్దిఖ్ నగర్, పీజేఆర్ నగర్, రాఘవేంద్ర సొసైటీ, రాజరాజేశ్వర నగర్ కాలనీ తదితర కాలనీలు ఉన్నాయి. ఈ డివిజన్ సైతం విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ అధిక జనసాంద్రత కలిగి ఉంది. ప్రస్తుతం ఈ డివిజన్లో ఓటర్ల సంఖ్య 69546

కొండాపూర్ డివిజన్ ముఖచిత్రం

గత ఎన్నికల ఫలితాల తీరు ఇది

2016 జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈ డివిజన్ లో 29797 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. డివిజన్ నుండి పోటీలో ప్రధానంగా ఉన్న వారిలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హమీద్ పటేల్ 16246 ఓట్లతో విజయం సాధించాడు. టిడిపి నుండి పోటీ చేసిన మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్ 8912 ఓట్లతో రెండవ స్థానంలో నిలువగా, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఊట్ల కృష్ణ 4088 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాడు.

ప్రస్తుతం ఈ డివిజన్ నుండి పోటీ పడుతున్న ప్రధాన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

షేక్ హమీద్ పటేల్(టిఆర్ఎస్)

షేక్ హమీద్ పటేల్

కొండాపూర్ డివిజన్ రాజకీయాల్లో ఎంతోకాలంగా క్రియాశీలకంగా ఉన్న హమీద్ పటేల్ నియోజక వర్గ ప్రజలకు మైనారిటీ నాయకుడిగా సుపరిచితుడు. కాంగ్రెస్, టిడిపి పార్టీల్లో సైతం పనిచేసిన హమీద్ పటేల్ గతంలో శేరిలింగంపల్లి మున్సిపాలిటీ లో కౌన్సిలర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన హమీద్ పటేల్ డివిజన్ ప్రజలకు తనదైన రీతిలో సేవలు అందిస్తున్నాడు. ఈయన ప్రధాన బలం డివిజన్ లోని మైనారిటీ ఓటర్లే. టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు, సొంత సామజిక వర్గ ఓటర్లే బలం, బలగాలుగా మరోసారి ఎన్నికల బరిలో నిలిచాడు.

మారబోయిన రఘునాథ్ యాదవ్(బిజెపి)

మారబోయిన రఘునాథ్ యాదవ్

మాజీ శాసన సభ్యులు బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ ల సమీప బంధువైన ఎం.రఘునాథ్ యాదవ్ కొండాపూర్ డివిజన్ బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిచాడు. బీజేపీ అధిష్టానం బిక్షపతియాదవ్ కు కేటాయించిన నాలుగు డివిజన్లలో ఒక స్థానాన్ని సొంతం చేసుకుని, వారి అండదండలతోనే పోటీకి సిద్దమయ్యాడు. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో గచ్చిబౌలి డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా రఘునాథ యాదవ్ పోటీ చేయగా ఆశించిన స్థాయిలో ఓట్లు సాధించలేకపోయారు. బీజేపీ పార్టీ ఓటుబ్యాంకు, సొంత సామజిక వర్గ ఓటర్లను నమ్ముకుని ఎన్నికల్లో తలపడుతున్నారు.

మహిపాల్ యాదవ్(కాంగ్రెస్)

మహిపాల్ యాదవ్

శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గంగల మహిపాల్ యాదవ్ స్థానిక రాజకీయాల్లో చురుకైన కార్యకర్తగా పేరు సాధించాడు. ప్రస్తుత బిజెపి నాయకుడు రవికుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో యూత్ కాంగ్రెస్ విభాగంలో ఆయనకు ప్రధాన అనుచరుడిగా ఉంటూ కొండాపూర్ డివిజన్ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాడు. ఇటీవల రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి సైతం పోటీ చేశాడు. నియోజక వర్గ పార్టీ నాయకులు కాంగ్రెస్ ను వీడినా పార్టీ జెండానే నమ్ముకుని కొండాపూర్ డివిజన్ అభ్యర్థిగా బరిలో నిలిచాడు మహిపాల్ యాదవ్.

ఈ ప్రాంతపు సిపిఐ నేత దివంగత రక్తపు నాగేష్ గౌడ్ స్థానంలో ఆ పార్టీ నాయకుడు కనకమామిడి శ్రీశైలం గౌడ్, టిడిపి అభ్యర్థిగా సిరాజ్, స్వతంత్ర అభ్యర్థులుగా జనపాల దుర్గ ప్రసాద్(టార్చ్), సాజిదా బేగం(బ్యాట్), ఎం.హరీష్ సాగర్ (గ్లాస్) లు పోటీలో మిగిలిన అభ్యర్థులుగా ఉన్నారు.

ప్రధాన పార్టీల జయాపజయాలపై కాంగ్రెస్ ఓట్ల ప్రభావం

తాజా పరిస్థితులను పరిశీలిస్తే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హమీద్ పటేల్ డివిజన్ వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, పార్టీలో కొత్తగా చేరిన నాయకులు, తోడుగా ఉన్న మైనారిటీ నాయకులను కలుపుకుని ఎన్నికల శిబిరాన్ని ఉత్సాహంగా నడిపిస్తున్నాడు. గత ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి నీలం రవీందర్ ముదిరాజ్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోడిచెర్ల టి.కృష్ణలు టిఆర్ఎస్ పార్టీలో చేరి హమీద్ పటేల్ కు మద్దతుగా పనిచేయడం అధికార పార్టీకి కలిసొచ్చిన అంశం. ఎంఐఎం పార్టీ అభ్యర్థులు సైతం పోటీ నుండి నిష్క్రమించడం తో టిఆర్ఎస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న మైనారిటీ ఓటర్లు సైతం చీలిపోయే అవకాశాలు తగ్గిపోయాయి. ఈ డివిజన్లో బీజేపీ కి బలమైన నాయకులు తక్కువగా ఉన్నప్పటికీ ఓటర్లు మెండుగానే ఉన్న సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రేటర్ లో బీజేపీ ప్రభావం పెరుగుతున్న కారణంగా పార్టీ అభ్యర్థి రఘునాథ్ యాదవ్, హమీద్ పటేల్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహిపాల్ యాదవ్ కీలకంగా మారాడు. టిఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకును మహిపాల్ యాదవ్ ఎంత ఎక్కువగా చీల్చితే అంతగా బిజెపికి అనుకూలించే అవకాశాలు ఏర్పడనున్నాయి. లేని పక్షంలో కారు దే హవా కొనసాగేలా కనిపిస్తుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here