గచ్చిబౌలి డివిజన్ లో రాజకీయాలు గరం గరం

  • నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న టిఆర్ఎస్, బీజేపీ ల ప్రచారం
  • క్లాస్ ఓటర్లు ఉన్నా, మాస్ ఓటర్లదే తుది తీర్పు
  • డివిజన్ లో కీలకంగా మారనున్న పోలింగ్ శాతం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలోనే అత్యధిక విస్తీర్ణం కలిగిన డివిజన్ గచ్చిబౌలి(105 ). ప్రపంచ ప్రఖ్యాత విప్రో, టిసిఎస్, ఇన్ఫోటెక్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటి సంస్థలు ఈ డివిజన్లోనే ఉన్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉద్యోగరీత్యా ఈ ప్రాంతాల్లోనే స్థిర నివాసాలు ఏర్పరచుకుని జీవిస్తున్నారు. ప్రస్తుతం 50876 మంది ఓటర్లు కలిగిన ఈ డివిజన్ లో అభివృద్ధి చెందిన కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు రాయదుర్గం, నల్లగండ్ల గ్రామం, గోపన్ పల్లి, గోపన్ పల్లి తండా, గౌలిదొడ్డి, నానక్ రామ్ గూడ, కేశవ్ నగర్, ఎన్టీఆర్ నగర్ వంటి మాస్ ఓటర్ల ప్రభావం ఉండే ప్రాంతాలకూ కొదువ లేదు. దర్గా తదితర ప్రాంతాల్లో నివాసం ఉండే మైనారిటీలు సైతం ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్లాస్ మాస్ ఓటర్ల సమ్మిళితమే గచ్చిబౌలి డివిజన్.

గచ్చిబౌలి డివిజన్ ముఖచిత్రం

గత జిహెచ్ఎంసి ఎన్నికల తీరు ఇది.
గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో శేరిలింగంపల్లిలోనే అత్యల్ప పోలింగ్ శాతం ఈ డివిజన్ లో నమోదైంది. 19832 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన కొమిరిశెట్టి సాయిబాబా 10707 ఓట్లు సాధించి విజయం సాధించాడు. బిజెపి నుండి పోటీ చేసిన సి.రామారావు 4847 ఓట్లతో రెండవ స్థానం లో నిలువగా, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన కొండా రవి గౌడ్ 2062 ఓట్లు సాధించి మూడవ స్థానం లో నిలిచాడు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మగారి రవీందర్ రెడ్డి 1050 ఓట్లు సాధించాడు. మిగిలిన అభ్యర్థులు ఎవ్వరూ ఆశించిన స్థాయిలో ఓట్లు సాధించలేదు.

డివిజన్ నుండి పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

కొమిరిశెట్టి సాయిబాబ(టిఆర్ఎస్)

కొమిరిశెట్టి సాయిబాబ

గచ్చిబౌలి డివిజన్ నుండి బరిలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబ కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితుడు. ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీని ఎవ్వరూ ఆదరించని సమయంలో అప్పటి నియోజకవర్గ టిఆర్ఎస్ ఇంచార్జి కొండకల్ శంకర్ గౌడ్ ప్రధాన అనుచరుడిగా కొనసాగాడు. ఉద్యమానికి అండగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేయడంతో టిఆర్ఎస్ అధిష్టానం గత ఎన్నికల్లో గచ్చిబౌలి స్థానం నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సాయిబాబ 5860 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించాడు. అనంతరం తనదైన పంథాలో డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ గత ఐదేళ్ళలో మచ్చ లేని నాయకుడిగా పేరు సంపాదించాడు. కొన్ని పెండింగ్ పనుల విషయంలో అక్కడక్కడా కొంత వ్యతిరేకత ఉన్నప్పటీకీ మెజారిటీ ప్రజలు మెచ్చిన నాయకుడిగా సాయిబాబ మరోసారి ఎన్నికల పోరులో కొనసాగుతున్నాడు.

గంగాధర్ రెడ్డి(బీజేపీ)

వాసెపల్లి గంగాధర్ రెడ్డి

గోపన్ పల్లికి చెందిన వాసెపల్లి గంగాధర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థానిక ప్రజలకు సుపరిచితుడు. శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు మారబోయిన రవికుమార్ యాదవ్ ప్రధాన అనుచరుడిగా గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాడు. రవికుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్నప్పటి నుండీ అయన నమ్మిన బంటుగా పనిచేస్తూ స్థానిక రాజకీయాలపై పట్టు సాధించాడు. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ లోకి రవికుమార్ యాదవ్ తో పాటు చేరాడు. బిజెపి టిక్కెట్టు కోసం ఈ డివిజన్ నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ రవికుమార్ యాదవ్ సహకారంతో తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకోగలిగాడు. డివిజన్లో గల బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ ల అనుచరగణం, బీజేపీ పార్టీ ఓటుబ్యాంకులే బలాలుగా బరిలో కొనసాగుతున్నాడు గంగాధర్ రెడ్డి.

అరకల భరత్ కుమార్ (కాంగ్రెస్)

అరకల భరత్ కుమార్ గౌడ్

రాయదుర్గం ప్రాంతానికి చెందిన అరకల భరత్ కుమార్ గౌడ్ గత మూడు దశాబ్దాలుగా స్థానికంగా ఓ విద్య సంస్థను నడుపుతూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. దీంతో పాటు సొంత సామాజిక వర్గంలో సైతం పట్టు కలిగిన భరత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ లో ఉన్నాడు. నియోజకవర్గం లోని మెజారిటీ కాంగ్రెస్ నాయకులంతా బిజెపి లో చేరినప్పటికీ, విద్యా సంస్థతో అనుబంధం ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులు, వ్యక్తిగత పరిచయాలు, సొంత సామజిక వర్గ నాయకుల మద్దతుతో ఎన్నిలకల్లో పోటీ చేస్తున్నాడు భరత్ కుమార్.

మిగిలిన పోటీదారుల్లో దళిత బహుజన పార్టీ అభ్యర్తి అర్షాల రాజు, స్వతంత్ర అభ్యర్థులు పి.చంద్ర మౌళి(బ్యాట్ గుర్తు), సంగం ప్రవీణ్ కుమార్ గౌడ్(ఫుట్ బాల్) లు తమ తమ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.

క్లాస్ ఓటర్లను పోలింగ్ బూతులకు రప్పించగలిగితే…
ఈ డివిజన్ల ఓటర్ల తీరును పరిశీలిస్తే క్లాస్ మాస్ ఓటర్ల ప్రభావం దాదాపు సమానంగా ఉన్నప్పటికీ మాస్ ఓటర్లే తుది నిర్ణేతలుగా మారనున్నారు. అయితే ప్రతీ ఎన్నికలో ఈ డివిజన్ నుండి ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి బరిలో నిలిచిన ఏకైక ఉద్యమకారుడు, పైగా స్థానికుడు కావడంతో పాటు టీఆరెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉన్నకారణంగా సాయిబాబ డివిజన్ ను కైవసం చేసుకున్నాడు. ఈ ఎన్నికల్లో సైతం పార్టీ బలంతో పాటు, గత ఐదేళ్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నాడు. అయితే ఈ ప్రాంతంలో బీజేపీ అనుకూల ఓటర్లు సైతం ఎక్కువగానే ఉన్నారని చెప్పవచ్చు. ఈ కారణంగానే గత ఎన్నికల్లో బీజేపీ టిడిపి కూటమి ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. పోటీలో తలపడ్డ అభ్యర్థి సి.రామారావు కు వ్యక్తిగత ఓట్ల కంటే పార్టీ పరంగానే ఎక్కువ ఓట్లు లభించినట్లు సమాచారం. తాజా పరిస్థితుల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ పరంగా పెద్దగా తోడ్పాటు లేకున్నప్పటికీ వ్యక్తిగత ఇమేజ్ తో ప్రచారంలో దూసుకుపోతున్నాడు. గ్రేటర్లో బీజేపీ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో డివిజన్ లో రాజకీయాలు బీజేపీ, టిఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి భరత్ కుమార్ మైనారిటీలు ఎక్కువగా ఉన్న రాయదుర్గం ప్రాంతానికి చెందిన స్థానిక నేత కావడం చేత టిఆర్ఎస్ అనుకూల మైనారిటీ ఓట్లు చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు దూరంగా ఉండే క్లాస్ ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకురాగలిగితే పోటీ మరింత రసకందాయంలో పడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here