అభివృద్ధి చేయమని ప్రశ్నిస్తే కేటీఆర్ ఆర్మితో బూతులు తిట్టిస్తున్నారు: కొండా విశ్వేశ్వరరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ నాయకులు నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేసిన హామీలపై ప్రశ్నిస్తే సామాజిక మాధ్యమాలలో పార్టీ కార్యకర్తలతో బూతులు తిట్టిస్తున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలతో హైదర్ నగర్ డివిజన్ లోని అలీ తలాబ్ చెరువును పరిశీలించారు.

హైదర్ నగర్ డివిజన్ అలీ తలాబ్ చెరువు వద్ద కాంగ్రెస్, బిజేపీ నాయకులతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి

ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా దత్తత తీసుకున్న హైదర్ నగర్ డివిజన్ లో అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. అలీ తలాబ్ చెరువుకు ఎస్టీపి నిర్మాణం చేయలేదని, అపార్టుమెంట్లు, ఇండ్ల నుంచి వచ్చే డ్రైనేజీ తో మురికి కూపంగా మారిందన్నారు. కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రత్యేకమైన డివిజన్ అయిన కారణంగా చెరువును పునరుద్ధరించాలని ట్విట్టర్ వేదికగా తాను ప్రశ్నించానని తెలిపారు. తనకు సమాధానం ఇవ్వకపోగా కేటీఆర్ ఆర్మీ తనపై అసభ్య పదజాలంతో దాడి చేస్తున్నారన్నారు. అధికార పక్ష నాయకులకు దమ్ముంటే క్షేత్రస్థాయిలో చర్చకు రావాలని సవాల్ విసిరితే ఏ ఒక్క నాయకుడు సమాధానం ఇచ్చేందుకు ముందుకు రాలేదని ఇదే టీఆర్ఎస్ నేతల చిత్తశుద్ధని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు చెరువుల అభివృద్ధి కోసం కృషి చేశానని, నా స్వంత నిధులతో చెరువుల పటిష్టత కోసం కృషి చేశానన్నారు.

అలీ తలాబ్ చెరువును పరిశీలిస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి

అలీ తలాబ్ చెరువు రూపురేఖలు మారుస్తామని చెప్పి కబ్జాలకు పాల్పడుతున్నారని, వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేస్తున్నామని కోట్లాది రూపాయలను వెచ్చించి, కుక్కలు నడిచేందుకు కూడా పనికిరాని వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేశారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవగానే బస్ షెల్టర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించిన కార్పొరేటర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతి సమస్యను తీర్చేందుకు తాను ఎల్లప్పుడూ ముందు ఉంటానని ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజా పోరాటంలో ముందుకు వెళ్తానని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా అందరితో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. హుజురాబాద్ లో ఈటెలను గెలిపించేందుకు శాయాశక్తుల ప్రయత్నిస్తానని, తన కార్యాచరణ త్వరలోనే వెల్లడిస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఎం. రవికుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ జానకిరామరాజు, నాయకులు సీతారామరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నేసతీష్, రఘునందన్ రెడ్డి, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here