నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర పంచాయత్ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్‌ను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ డిల్లీలో ఆదివారం కలిశారు. మంత్రితో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర బృందం ప్రత్యేకంగా చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో బిసి ‘డి’ లో పరిగణింపబడుతున్న సగర (ఉప్పర) కులాన్ని సంచార జాతిగ గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించే విధంగా ఓబిసి కమిషన్ తో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సంఘం రాష్ట్ర కమిటీ బృందం మంత్రిని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా అత్యంత వెనుకబడిన సగర (ఉప్పర) కులాన్ని ఇతర సమాజంతో సమానత్వంగా జీవించడానికి రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వం సహాయకారిగా చేయూతనందించాల్సిన అవసరం ఉందని సంఘం నాయకులు మంత్రికి విన్నవించారు. పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలోని సగర జాతిని అత్యంత వెనుకబడిన జాతిగా గుర్తించిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు కల్పించేందుకు అత్యంత వెనుకబడిన జాతిగా సగర(ఉప్పర)లను పరిగణించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ప్రధానితో పాటు సంబందిత శాఖ మంత్రులు, అధికారులతో చర్చించి న్యాయం జరిగేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్వాతంత్య్రానంతరం దేశంలో మొట్టమొదటిసారి ఓబిసిలకు పెద్దపీట వేస్తూ 27 మంది కేంద్ర మంత్రివర్గంలో చోటుకల్పించడంతో పాటుగా లవన్కార్ (సగర/ఉప్పర) సమాజానికి చెందిన కఫిల్ మోరేశ్వర్ పాటిల్ గారిని పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రిగా అవకాశం కల్పించినందుకు దేశంలోని మా జాతియావత్ తరుపున ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడి గారికి మీడియా ద్వారా తెలంగాణ సగర సంఘం ధన్యవాదాలు తెలియజేసింది. మంత్రిని కలిసిన వారిలో జాతీయ లవన్కార్ సమాజ్ ఫెడరేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి చాతిరి వెంకట్రావ్ సగర, లవన్కార్ సమాజ్ ఫెడరేషన్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ భారతి, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, రాష్ట్ర కోశాధికారి నలుబాల బిక్షపతి సగర, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సగర, ప్రధాన కార్యధర్శి మర్క సురేష్ సగర తదితరులు ఉన్నారు.