- ఎంసిపి ఐయూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగొని రవి
నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యలను పరిష్కరించని రాష్ట్ర ప్రభుత్వ విధానానికి నిరసనగా ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నామని ఎంసిపి ఐయూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగొని రవి తెలిపారు. బాగ్ లింగంపల్లిలోని ఓంకార్ భవన్ లో జరిగిన ఎంసిపి ఐయూ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2018 ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను విస్మరించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ప్రజలకు సంబంధం లేని విషయాలను ముందుకు తెచ్చి, రాజకీయ ప్రయోజనాల కోసం పాకులడుతుందని అన్నారు. సంక్షేమ పథకాలను ప్రకటించి సరైన నిధులు కేటాయించలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల వాగ్దానం మేరకు ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు అందించలేక పోయాయని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ల స్థానంలో ఇల్లు కట్టుకునే వారికి మూడు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనం అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని అన్నారు. ఎంసిపి ఐయూ ఆందోళన కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చినారు. అనంతరం ఎంసిపి ఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి. తుకారాం నాయక్ మాట్లాడుతూ.. పార్టీ నిర్మాణాన్ని హైదరాబాద్ ప్రాంతంలో మరింత బలోపేతం చేసుకోవడానికి.. ఈ నెల 28న గ్రేటర్ హైదరాబాద్ ప్లినం జరుపాలని కమిటీ సమావేశం నిర్ణయం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వనం సుధాకర్, కుంభం సుకన్య, గ్రేట్ హైదరాబాద్ నాయకులు తాండ్ర కళావతి, బి విమల, ఈ కిష్టయ్య, పల్లె మురళి, ఈ దశరథ్ నాయక్, యాదగిరి పాల్గొన్నారు.