శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జంట సర్కిళ్ళ పరిధిలోని 35 కాలనీలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతి కాలనీలో పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, 5 ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నారు. దీనిలో భాగంగా మియాపూర్ ప్రాంతంలోని సత్యకళ్యాణి అపార్ట్మెంట్ (RBR Complex 4th Block), ఆల్విన్ కాలనీ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ పరిశుభ్రత, ఆరోగ్యం, అలంకరణల మేళవింపే ముగ్గులు అని అన్నారు. ఈ పోటీల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
పోటీలలో విజేతల ఎంపికలో తాటిచర్ల వరలక్ష్మి, అనూషా జడ్జీలుగా వ్యవహరించారు. ఈ పోటీలలో 50 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకురాళ్ళు కస్తూరి, శ్రీదేవి, అంజలి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాణి సాంబశివరావు, నల్లూరి పట్టాభిరామ్, పాకాలపాటి శ్రీనివాస్, అంకమ్మ చౌదరి, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.