- తరలి వచ్చిన బస్తీలు… అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు…
- పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నేతల నివాళీ…
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ గ్రామం ఎరుపు సంద్రమైంది. తమ అభిమాన ఉద్యమ నేత చివరి చూపు కోసం స్థానిక ప్రజలు మొదలు ఇతర రాష్ట్రాల నేతల వరకు పోటీపడ్డారు. నాయకుడంటే ఇలా ఉండాలిరా అనే రీతిలో తాండ్ర కుమార్ అంతిమ యాత్ర కొనసాగింది. మియాపూర్ పరిధిలో తాను స్థాపించిన ఎంఏనగర్, స్టాలిన్‌నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, టేకు నర్సింహానగర్, ఓంకార్ నగర్ తదితర బస్తీలతో పాటు శేరిలింగంపల్లిలోని అన్ని ప్రాంతాల నుంచి తాండ్ర కుమార్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అశ్రునయనాలతో ఆయన పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు. మియాపూర్ లోని తన నివాసం నుంచి బొల్లారం క్రాస్ రోడ్డు లోని స్మశాన వాటిక వరకు కొనసాగిన తాండ్ర కుమార్ అంతిమయాత్రలో ప్రజా కళాకారులు ఉద్యమ గేయాలతో, మహిళల కోలాటాలతో కార్యకర్తలు ఎర్ర జెండా వాలంటరీ కవాతు చేస్తూ జోహార్లు అర్పించారు. తన ఆశయ సాధన కోసం తుది శ్వాస వరకు పోరాడతామని, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని పూలతో ప్రతిజ్ఞ నినాదాలు చేస్తూ భారీ అంతిమ యాత్రను నిర్వహించారు.
అనంతరం జరిగిన సంతాప సూచికంగా ఎంసీపీఐయూ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ మాట్లాడుతూ తాండ్ర కుమార్ ఎంసీపీఐయూ ఏర్పాటు నుండి తుది శ్వాస వరకు ఎర్రజెండా చేతపట్టి బడుగు బలహీన వర్గాల కష్ట జీవుల చెంత చేరి వారి సమస్యలకై పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. గ్రేటర్ హైదరాబాద్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించి ప్రజలకు గూడు కల్పించిన పేదల నేత అని అన్నారు. ప్రభుత్వ నిర్బంధ కాండను, జైలుగోడల ను లెక్కచేయకుండా అహర్నిశలు పార్టీ కోసం, ప్రజల కోసం జీవించిన వ్యక్తి తాండ్ర కుమార్ అని అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ఎంసీపీఐయూ బలోపేతం కోసం మరింత ముందుకు కొనసాగుతామన్నారు. ఎంసీపీఐయూ కేంద్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ కృష్ణ మాల్ (కేరళ ) మాట్లాడుతూ కామ్రేడ్ తాండ్ర కుమార్ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర నాయకుడు కాదని జాతీయ నాయకుడని, ఆయన పోరాట స్ఫూర్తితో కేరళ రాష్ట్రం ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. ప్రజా బహుజన ఉద్యమాలకు తీరనిలోటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలిట్ బ్యూరో సభ్యులు కాటన్ నాగభూషణం, ఉపేందర్ రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు శావన పూడి నాగరాజు, శివయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, కుంభం సుకన్య, వస్కుల మట్టయ్య, గోనె కుమారస్వామి, పెద్దాపురం రమేష్ కన్నం వెంకన్న, వి తుకారాం నాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు మైదాన్ శెట్టి రమేష్, టి అనిల్ కుమార్, ఏ. పుష్ప, పి.మురళి, పసుపుల సైదమ్మ, రాగసుధ, మంద రవి, నాగార్జున, రాజ శేఖర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిజీ నరసింహారావు, బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్, సీపీఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, శేరిలింగంపల్లి సీపీఐఎం నాయకులు సి శోభన్ కృష్ణ, సీపీఐ జిల్లా నాయకులు ఐలయ్య, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, బిజెపి రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, బిజెపి రంగారెడ్డి జిల్లా అర్బన్ ఓబీసీ అధ్యక్షులు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్, బిఎస్ పి శేరిలింగంపల్లి ఇంచార్జ్ రాములు, తదితరులు తాండ్ర కుమార్ అంతిమ యాత్రలో పాల్గొని ఘన నివాళి అర్పించారు.