శేరిలింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల స్థలం ఫెన్సింగ్ కూల్చివేసి కబ్జాకు యత్నం

  • స్థలం మధ్యలో నుంచి విద్యుత్ లైన్ స్తంభాల ఏర్పాటుకు యత్నం
  • శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, చందానగర్ డిప్యూటీ కమిషనర్లకు ఫిర్యాదు
  • ఫెన్సింగ్ కూల్చివేతపై క్రిమినల్ కేసు నమోదుకు డిప్యూటీ కమిషనర్ ఆదేశం

శేరిలింగంపల్లి, జూన్ 4 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం చందానగర్ లో కేటాయించిన భూమిలోకి అక్రమంగా ప్రవేశించిన కబ్జాదారులు స్థలం చుట్టూ రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను తొలగించారు. స్థలం మధ్యలో నుంచి విద్యుత్ లైన్ ఏర్పాటు కోసం విద్యుత్ శాఖ అధికారులు స్తంభాల నిర్మాణ పనులు చేపట్టాగా, సమాచారం అందుకున్న శేరిలింగంపల్లి జర్నలిస్టులు పనులను అడ్డుకొని విషయాన్ని మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు. ఫెన్సింగ్ కూల్చివేతపై ఎమ్మెల్యే గాంధీ, చందానగర్ డిప్యూటీ కమిషనర్, చందానగర్ కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు. శేరిలింగంపల్లి మండల పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం చందానగర్ లోని సర్వే నెంబర్ 174 లో 1 ఎకరా స్థలాన్ని గతంలోనే కేటాయించిన విషయం తెలిసిందే. రెవెన్యూ అధికారులు హద్దులు నిర్ణయించి, పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసిన ఈ స్థలం చుట్టూ జర్నలిస్టులు ఖడీలు ఏర్పాటు చేసి రక్షణ కోసం ఫెన్సింగ్ వేశారు.

సోమవారం కొంతమంది కబ్జాదారులు ఫెన్సింగ్ కూల్చివేసి జర్నలిస్టుల ఇళ్ల స్థలంలోకి అక్రమంగా ప్రవేశించారు. దీంతోపాటు ఈ స్థలానికి పక్కనే ఉన్న ప్రైవేట్ స్థలంలో ఉన్న విద్యుత్ లైన్ ను మార్చి, జర్నలిస్టుల ఇళ్ల స్థలం మధ్యలో నుంచి స్తంభాలను ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు విద్యుత్ శాఖ అధికారుల పనులను అడ్డుకొని మంగళవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. ఫెన్సింగ్ కూల్చివేతపై ఎమ్మెల్యే గాంధీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారుల తీరుపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పక్క స్థలంలో ఉన్న విద్యుత్ లైన్ ను మార్చి తమ స్థలంలో స్తంభాలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ఏడీఈని ప్రశ్నించారు. దీంతో తప్పు తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు నాటిన స్తంభాలను తొలగించడంతో పాటు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫెన్సింగ్ కూల్చివేతపై శేరిలింగంపల్లి జర్నలిస్టులు చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన డిప్యూటీ కమిషనర్ ఫెన్సింగ్ కూల్చివేసిన వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చందానగర్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ల నాయకులు, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్, టెంజు కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి జర్నలిస్టులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here