శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 3 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ వెంకా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3వ తేదీన ఉదయం 10 గంటలకు గోపన్‌పల్లి, నల్లగండ్ల, నానక్‌రాంగూడ వాసులకు గాను గోపన్‌పల్లి విలేజ్, గౌలిదొడ్డి, కార్పొరేటర్ కార్యాలయాల్లో సదస్సులను నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా 4వ తేదీ ఉదయం 10 గంటలకు రాయదుర్గ ఖల్సా, రాయదుర్గ నోవ్ ఖల్సా, పాన్ మక్తా, పైగా, ఖాజాగూడలకు రెవెన్యూ సదస్సులను రాయదుర్గ వార్డ ఆఫీసులో నిర్వహిస్తామని అన్నారు. ఈ నెల 5వ తేదీన శేరిలింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, కంచ గచ్చిబౌలి వాసులకు గాను అంజయ్య నగర్ వార్డు ఆఫీసులో సదస్సులు ఉంటాయని తెలిపారు.
ఈ నెల 3వ తేదీన మాదాపూర్ కాకతీయ హిల్స్‌లోని వార్డు ఆఫీస్‌లో గుట్టల బేగం పేట, ఇజ్జత్ నగర్, ఖానామెట్, గఫూర్ నగర్, మాదాపూర్ వాసులకు రెవెన్యూ సదస్సులు ఉంటాయన్నారు. 4వ తేదీన మియాపూర్ మయూరినగర్‌లోని వార్డు ఆఫీస్‌లో మియాపూర్, రామన్నగూడ, మక్తా మహబూబ్ పేట వాసులకు సదస్సులు ఉంటాయన్నారు. 5వ తేదీన చందానగర్‌లోని గౌతమినగర్ వార్డు ఆఫీస్‌లో తారానగర్, చందానగర్ వాసులకు, 6వ తేదీన ఓల్డ్ హఫీజ్‌పేటలోని వార్డు ఆఫీస్‌లో హఫీజ్‌పేట, కొత్తగూడ, మదీనాగూడ వాసులకు రెవెన్యూ సదస్సులు ఉంటాయని తెలిపారు. ఆయా సదస్సులకు గాను పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని, ప్రజలు తమకు ఉండే సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు.