శేరిలింగంపల్లి, జూన్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ జనప్రియ అపార్ట్‌మెంట్స్ ఫేజ్-5 లో నివాసం ఉంటున్న కాలనీవాసులు తమ అపార్ట్‌మెంట్స్‌కు చెందిన భూమిని కబ్జా నుంచి కాపాడాలని కోరుతూ శేరిలింగంపల్లి జోన్ సిటీ ప్లానర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2000వ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ నుంచి మియాపూర్ విలేజ్ సర్వే నంబర్లు 47, 48, 49, వైడ్ ఎల్ఆర్ నం.15512/ఎంపి2/హెచ్/98 07 హుడా, ప్రాసెసింగ్ నంబర్ జి129/బీపీ/3350/200లో 650 ప్లాట్లను నిర్మాణం చేసుకుని వాటిలో తాము నివాసం ఉంటున్నామని తెలిపారు. ఈ మధ్యనే కొందరు తమ పక్కన ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం ప్రారంభించారని, వారు తమ అపార్ట్మెంట్స్ డ్రైనేజీ నాలాను ఆక్రమించారని, తమ అపార్ట్‌మెంట్స్ సరిహద్దు గోడను కూల్చివేశారని, తమ స్థలాన్ని రోడ్డుగా చూపి తమ స్థలంలోకి ప్రవేశించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. తమ అపార్ట్‌మెంట్స్‌లో ఖాళీగా ఉన్న స్థలాన్ని వారు రోడ్డుగా చూపిస్తున్నారని అన్నారు. దీనిపై వెంటనే స్పందించి సదరు వ్యక్తులకు ఇచ్చిన పర్మిషన్, ఆక్యుపేషన్ సర్టిఫికెట్లను వెంటనే రద్దు చేయాలని కోరారు. జనప్రియ అపార్ట్‌మెంట్స్ ఫేజ్ 5లో నివసిస్తున్న 650 కుటుంబాలకు న్యాయం చేయాలని, ఆయా వ్యక్తులకు అక్రమ పర్మిషన్, ఆక్యుపెన్సీ ఇచ్చిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే స్థలాన్ని సందర్శించి నిజాలు తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అపార్ట్‌మెంట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.