నమస్తే శేరిలింగంపల్లి: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మధురా నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (రాయదుర్గం)లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రియ విశ్వ విద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వీరబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి డా. వీరబాబు మాట్లాడుతూ, 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించిన రోజునే భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ 299 మంది సభ్యులుగా ఉన్న రాజ్యాంగ పరిషత్ నవంబర్ 26, 1949 న అమోదించిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చిందని తెలిపారు. ఆ రోజు నుండి సర్వ సత్తాక ఘనతంత్ర రాజ్యాంగంగా అవతరించిందని అన్నారు. రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 22 విభాగాలు, 8 షెడ్యూళ్లతో ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా పేరు పొందిందని అన్నారు. ఈ రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టిందని అన్నారు. రాజ్యాంగ ప్రతి మీద 284 మంది సభ్యులు సంతకాలు చేశారని తెలిపారు. ఈ భారత రాజ్యాంగ ప్రతిని ప్రేమ్ బిహారి నారాయణ రైజాద తన స్వ దస్తూరితో వ్రాశారన్నారు. భారత రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీలో ఏడుగురు సభ్యులు ఉన్నారని, వారిలో అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్, ఎన్. గోపాల స్వామి, డా బి అర్ అంబేద్కర్, కె ఎమ్ మున్షి, మొహ్మద్ సదుల్ల, బి ఎల్ మిట్టర్, డిపి ఖైతాన్ తో కూడిన డ్రాఫ్ట్ కమిటీకి డా బి అర్ అంబేద్కర్ అధ్యక్షత వహించాడని పేర్కొన్నారు. ప్రజలు, పాలకులు, అధికారులు పాటించే నియామాలే రాజ్యాంగం అని అన్నారు. ప్రజలు, ప్రభుత్వాలు ఎలా ఉండాలి, చట్టాలు ఎలా ఉండాలి అనేది నిర్దేశించారని, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అందరికి ఉండాలని రాజ్యాంగాన్ని నిర్మించారని తెలిపారు. మన ప్రజాస్వామ్యం ఫెడరల్ వ్యవస్థ అని, ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర అధికారాలు, రాష్ట్ర అధికారాలు ఏ ఏ చట్టాలు ఎలా చెయ్యాలి అని స్పష్టంగా నిర్దేశించారన్నారు. దీనిలో ప్రధానంగా రాజ్యాంగానికి మూల స్థంభలైన శాసన, కార్య నిర్వహణ, న్యాయ వ్యవస్థలను ఏర్పాటు చేసి, ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ప్రజలందరికి లింగ వివక్షత లేకుండా, అందరికీ అన్ని సమానంగా, సాంఘికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా, న్యాయ పరంగా ఆలోచన భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్య్రాన్ని అంతస్థుల్లోను, అవకాశాల్లోను సమానత్వాన్ని చేకూర్చాటానికి, ప్రజలందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ, సౌభాతృత్వాన్ని పెంపోదించటానికి ఈ రాజ్యాంగాన్ని మనకి మనమే తయారు చేసుకున్నామని . ఈ మూడు వ్యవస్థల కన్నా రాజ్యాంగమే గొప్పదని, ఫెడరల్ సిస్టమ్ లో లెగిశ్లేచర్ వ్యవస్థలో లోక సభ, రాజ్యా సభ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్నారు. రాష్ట్రంలో శాసన సభ, శాసన మండలి రాజ్యాంగానికి లోబడి సుపరిపాలనకై చట్టాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జ్యూడిషియల్ అటార్ని జనరల్ (కేంద్ర స్థాయిలో), రాష్ట్ర స్థాయిలో అడ్వకేట్ జనరల్, సుప్రీం కోర్టు ప్రధాని న్యాయ మూర్తి, న్యాయ మూర్తులు, రాష్ట్ర స్థాయిలో హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి, న్యాయ మూర్తులు జ్యూడిషియల్ పరిధిలోకి వస్తారని వివరించారు. ఈ సందర్బంగా విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు డా. వీరబాబు నివృత్తి చేశారు. ఇప్పటి వరకు 105 సార్లు భారత రాజ్యాంగాన్ని సవరణ చేశారని అన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్ చార్జీ ప్రిన్సిపాల్ ఎమ్. శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్ జంగయ్య, శ్యామలేష్, రాజశేఖర్, రాఘవేంద్ర, నర్సింగ్, వెంకన్న, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.