శేరిలింగంపల్లి, జూలై 26 (నమస్తే శేరిలింగంపల్లి): ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న ఐదుగురు సభ్యులు ఉన్న ముఠా గుట్టును మియపూర్ పోలీసులు రట్టు చేశారు. నిందితులను అరెస్టు చేయడంతోపాటు వారి నుంచి 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మాదాపూర్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ డాక్టర్ వినీత్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. 2025వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన పుల్యాల ఉమాశంకర్ అనే వ్యక్తి అర్థరాత్రి 12 గంటల సమయంలో తన రాయల ఎన్‌ఫీల్డ్ బైక్ (TS07HS1746)ను హెచ్ఐసీ గేట్ ఎదుట పార్క్ చేశాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూస్తే బైక్ కనిపించలేదు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. షేక్, సోహెయిల్, షేక్ అహ్మద్, సల్మాన్ ఖాన్, షేక్ అర్మాన్ కౌస్, అల్మాస్ షేక్, సోహెయిల్ అలీ, కేస్మత్ అలీ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు చేసిన నేరాలు బయట పడ్డాయి. వీరిలో సోహెయిల్ అలీ, కేస్మత్ అలీ పరారీలో ఉన్నారని, మిగిలిన వారిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. వారి నుంచి 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

కాగా ఈ నిందితులపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు కూడా నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు. వీరు వాహనాలను చోరీ చేసేందుకు ముందుగా మద్యం, గంజాయి సేవిస్తారని తెలిపారు. డీసీపీ డాక్టర్ వినీత్, అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ సీహెచ్ వై.శ్రీనివాస్ కుమార్ ల నేతృత్వంలో పోలీసులు ఈ నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించేందుకు చాకచక్యంగా వ్యవహరించిన మియాపూర్ పీఎస్ ఎస్‌హెచ్‌వో పి.శివ ప్రసాద్, డిఐ జి.రమేష్ నాయుడు, డీఎస్ఐ బి.నరసింహా రెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ డి.చంద్రశేఖర్, ఎన్.ప్రేమ్ కుమార్, కానిస్టేబుల్స్ ఎ.సుభాష్ చంద్ర బోస్, మల్లికార్జున్, ఎన్.పూర్ణచందర్, ఎల్.జగన్‌లకు తగిన రివార్డును అందజేస్తామని డీసీపీ డాక్టర్ వినీత్ తెలిపారు.






