శేరిలింగంపల్లి, జూలై 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ సీపీఐ కార్యాలయంలో కే చందు యాదవ్ అధ్యక్షతన.. కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రామకృష్ణ హాజరై మాట్లాడుతూ భారతదేశంలోనే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఏకైక పార్టీ అని అన్నారు. వేల ఎకరాల భూములను పంచిన చరిత్ర సిపిఐ పార్టీకి దక్కిందని, హైదరాబాద్ మహానగరంలో పొట్ట జీవనం కోసం వలస కార్మికులను కూడగట్టి వారి బాగు కోసం ఇంటి స్థలాల కోసం పోరాటం చేశామని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 20 బస్తీలను నెలకొల్పిన చరిత్ర ఎర్ర జెండా సిపిఐ పార్టీకే దక్కిందన్నారు. నియోజకవర్గంలో ఎన్నో ఆటో స్టాండ్లను నిర్మించిన ఘనత కూడా సీపీఐదే అన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి నాటికి నేటికి ప్రజా ఉద్యమాలు చేసి రేషన్ కార్డులు, వితంతు పింఛన్లు, డ్వాక్రా గ్రూపు మహిళలకు లోన్లు, ఒంటరి మహిళ పింఛను, సీనియర్ సిటిజన్ పించను, చదువుకొని ఉద్యోగం లేని నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఇలా అనేక పోరాటాలు చేసిన పార్టీ సీపీఐ అని అన్నారు. ఈ క్రమంలోనే పార్టీ రంగారెడ్డి జిల్లా మహాసభలను ఆగస్టు 2న మొయినాబాద్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలలో భూ పోరాటాలు చేసేందుకు తీర్మానాలు చేయబోతున్నామన్నారు. మహాసభలు అయిపోయిన వెంటనే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలను కూడగట్టి భూ పోరాటాలకు శ్రీకారం చుడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కే వెంకట స్వామి, తుపాకుల రాములు, కే సుధాకర్, సురేష్ ముదిరాజ్, కే కాసిం, బి నారాయణ, చంద్రమ్మ, ఎస్ కొండలయ్య, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.






