నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ సాయి ఐశ్వర్య లే అవుట్ లో గల శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కొమిరిశెట్టి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఖాజాగూడ ప్రాంతంతో పాటు చుట్టు పక్కల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొమిరిశెట్టి వారి కుటుంబ సభ్యులు శివపార్వతులకు కనీవినీ ఎరుగని రీతిలో కళ్యాణోత్సవం జరిపించారు. అందరిని చల్లంగా చూడాలని, ఆయురారోగ్యాలతో కాపాడాలని ఈ సందర్భంగా వేడుకున్నారు. వేధ పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల శివ నామస్మరణలతో ఖాజాగూడ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.