- 11 మందికి తీవ్ర గాయాలు – ఇద్దరి పరిస్థితి విషమం…
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్‌రాంగూడలో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భవనం భారీగా ధ్వంసం అవ్వగా, 11 మంది తీవ్ర గాయల పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ సురేష్ వివరాలు వెళ్లడించారు. నానక్‌రాంగూడలోని స్థానిక హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న ఓ ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్‌లో, మొదటి అంతస్థులో కొందరు బీహార్‌కు చెందిన కూలీలు నివాసం ఉంటున్నారు. కాగా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వారిలో ఒకరు తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో లైట్ వేసేందుకు స్విచ్ ఆన్ చేయగా భారీ పేలుడు సంభవించింది.
దీంతో పెద్ద మొత్తంలో మంటలతో పాటు పేలుడు దాటికి గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లలో ఉన్న గోడలు కూలిపోయాయి. ఒకవైపు అగ్గికి, మరోవైపు భవన శిధిలాలు పడి గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివాసం ఉంటున్న ఆరుగురు, ఫస్ట్‌ఫ్లోర్‌లో నివాసం ఉంటున్న ఐదు మంది బీహర్ వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని కొండాపూర్ ఏరియా హాస్పిటల్, ఉస్మానియా దవఖానకు, అదేవిధంగా స్థానిక సాయిలైఫ్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. ఫైర్, జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి శిధిలాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో భారీ పేలుడుకు గ్యాస్ లీకేజీయే కారణమని గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్ లీకై గది మొత్తం లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ విస్తరించిందని, తెల్లవారు జామున లైట్ స్విచ్ వేసే క్రమంలో మంటలు ఒక్కసారిగా చెలరేగి రెండవ అంతస్థుకు విస్తరించినట్టు బాధితులు తెలిపారు. భారీ పేలుడుతో భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్, మొదటి అంతస్థు సహా రెండవ అంతస్థు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నది. అదేవిధంగ చుట్టు ముట్టు ఉన్న ఇండ్లలోను ఈ ప్రమాదం ప్రభావం చూపింది. ప్రమాదానికి కారణం, దాని తీవ్రతపై నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన 11 మందికి మెరుగైన చికిత్స అందిస్తుండగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.