శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): ఊరు గొప్ప, పేరు దిబ్బ అన్న చందంగా మారింది నల్లగండ్ల నవోదయ కాలనీ పరిస్థితి. హైటెక్ ప్రాంతానికి ఆనుకుని ఉండి, ఎటు చూసినా బహుళ అంతస్థుళ నిర్మాణాలు కనబడుతున్నా మౌళిక వసతులు లేకపోవడంతో స్థానిక ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. అభివృద్ది పనులకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నప్పటికీ అనేక కారణాలతో పనులు వాయిదా పడుతుండటంతో సమస్యలు పరిష్కారం జరుగడం లేదని స్థానికులు వాపోతున్నారు. కాలనీ ఏర్పాటై దాదాపు రెండు దశాబ్దాలు పూర్తవ్వగా, గత రెండు సంత్సరాలుగా అపార్ట్ మెంట్ల నిర్మాణం జరుగుతుండటంతో ప్రజలు కాలనీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. సరైన ప్రణాళిక లేకుండా కాలనీ ఏర్పాటు జరగడంతో మౌళిక వసతులు పూర్తి స్థాయిలో లేని కారణంగా స్థానికులు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు.
డ్రైనేజీ ఔట్‌లెట్ లేకపోవడమే ప్రధాన సమస్య…
ఈ కాలనీలో భూగర్భడ్రైనేజీ నిర్మాణం జరగాలంటే ముందుగా ఔట్‌లెట్ అందుబాటులో లేకపోవడంతోనే అభివృద్ది పనులు ముందుకు సాగడం లేదు. ఈ కాలనీ డ్రైనేజీ లెవెల్ కు సమీపంలో ఔట్‌లెట్‌ను అనుసంధానం చేసేందుకు ప్రధాన డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేదు. ఈ కారణంగా డ్రైనేజీ పనులు వాయిదా పడుతున్నాయి. సిసిరోడ్డు పనులు సైతం డ్రైనేజీతో పాటే జరుగాల్సి ఉంది. ఇప్పటికే నిర్మాణం జరిగిన అపార్ట్‌మెంట్ ల నిర్మాణదారులు సంప్‌లు ఏర్పాటు చేసి మురుగునీటిని అందులోకి వదులుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీని కారణంగా మురుగునీరు ఓవర్ ఫ్లో జరిగి రోడ్లపై పారుతోంది. ఫలితంగా నీరంతా రోడ్లపై పేరుకుపోయి దుర్గంధభరితంగా మారి దోమలు వృద్ది చెందుతున్నాయని స్థానికులు తెలిపారు.
ఇతర సమస్యలెన్నో…
కాలనీలో పై సమస్యలతో పాటు వీధి దీపాలు, త్రాగునీరు, వీధి కుక్కలు తదితర సమస్యలు నెలకొన్నాయి. భవన నిర్మాణాల వ్యర్థ పదార్థాలతో పాటు అపార్ట్‌మెంట్ ల నుండి వచ్చే చెత్త ఎక్కడికక్కడ కుప్పలుగా పేరుకుపోతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కాలనీ సమస్యలపై దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం: డిఈ శ్రీనివాస్
నవోదయ కాలనీ ఇతర కాలనీల నేలమట్టానికి దిగువన ఉండటంతో అంత లోతుగా ఉండే డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ సమీపంలో లేకపోవడంతో పనులు వాయిదా పడుతున్నట్లు శేరిలింగంపల్లి సర్కిల్ డిఈ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైపు ఔట్‌లెట్ ఉన్నట్లు కాలనీవాసులు తెలిపారని, దీనిపై పరిశీలనలు జరుగుతున్నాయని తెలిపారు. ఔట్‌లెట్ దొరకని పక్షంలో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంటుందన్నారు.