నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయాలనే ఆశయాన్ని బలం చేకూర్చే విధంగా తన వెంట నడిచిన శేరిలింగంపల్లి నియోజకవర్గ, కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ధన్యవాదాలు తెలిపారు. మియాపూర్ విశ్వనాథ గార్డెన్ వద్ద ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ జెండా రెపరేపలాడుతుందని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేస్తామని తెలిపారు.

ఎన్నికలలో గెలుపోటములు సహజం, ప్రజాతీర్పును గౌరవిస్తామని, తన వెంట నడిచిన నియోజకవర్గ ప్రజానీకానికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.