​మియాపూర్‌లో MDMA డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్.. 12.6 గ్రాముల డ్రగ్ స్వాధీనం..

శేరిలింగంపల్లి, మార్చి 4 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత MDMA డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని మియాపూర్ ఇన్ స్పెక్టర్ శివప్రసాద్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగ‌ళ‌వారం మధ్యాహ్నం విశ్వంభర కాలనీ పార్క్ సమీపంలో ఒక వోక్స్ వ్యాగన్ కారులో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందిందన్నారు. దీనిపై వెంటనే స్పందించిన మియాపూర్ పోలీస్, మాదాపూర్ ఎస్ఓటీ బృందం మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో అక్కడికి చేరుకుని సదరు వాహనాన్ని తనిఖీ చేశారు.

పోలీసులను గమనించి నిందితులు పారిపోయే ప్రయత్నం చేయగా వారిని చేజ్ చేసి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ​వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, కార్ డ్యాష్‌ బోర్డ్‌లోని జిప్‌లాక్ కవర్‌లో తెల్లటి క్రిస్టలైన్ పదార్థం లభ్యమైందన్నారు. డ్రగ్ డిటెక్షన్ కిట్‌తో పరీక్షించగా అది 12.6 గ్రాముల MDMAగా నిర్ధారణ అయిందని తెలిపారు. నిందితులు బేరి హనుమంతు (27), భూమని మహేష్ (26), కాసం ఆదర్శ్ (28)లను అరెస్ట్ చేసి విచారించగా, వారు బెంగళూరు నుంచి ఈ డ్రగ్స్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో అధిక లాభాలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. నిందితుల నుంచి డ్రగ్స్‌తో పాటు, ఒక వోక్స్ వ్యాగన్ కారు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ​ప్రస్తుతం నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ డ్రగ్ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ ను కూకట్‌పల్లి జోన్ అదనపు డీసీపీ ఎం. సుదర్శన్ పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించామన్నారు.

డ్రగ్స్ మహమ్మారి యువత జీవితాలను నాశనం చేస్తోందన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగం గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here