శేరిలింగంపల్లి, మార్చి 3 (నమస్తే శేరిలింగంపల్లి): హాస్పిటల్ లో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న ఓ మహిళ పేషెంట్లకు చెందిన బంగారు ఆభరణాలను తస్కరిస్తుండగా ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లిలోని చందానగర్ శివాజీనగర్‌లో నివాసం ఉంటున్న జెరిబేటి దుర్గ (45) మదీనాగూడలోని ఓ హాస్పిటల్‌లో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తోంది. ఫిబ్రవరి 25వ తేదీన రాత్రి 10:20 గంటల సమయంలో హాస్పిటల్‌లోని ఓ రూమ్‌లో ఓ రోగికి చెందిన బంగారు ఆభరణాలను ఆమె తస్కరించి అక్కడి నుంచి ఉడాయించింది. అనంతరం చందానగర్‌లోని అపర్ణ హిల్ పార్కు సిల్వర్ ఓక్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హాస్పిటల్‌లో తాము ఉన్న గదిలో నుంచి తమ బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హాస్పిటల్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించి చూడగా దుర్గ ఆ నగలను కాజేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను తన నివాసంలోనే అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఆమె వద్ద నుంచి 3 తులాల బంగారు చెయిన్, 3 తులాల బంగారు గాజులు రెండు, 1 తులం చెవి రింగు ఒకటి, 2 తులాల వెండి పట్టీలు రెండు, అరతులం వెండి మెట్టెలు ఒకటి స్వాధీనం చేసుకుని ఆమెను రిమాండ్‌కు తరలించారు. హాస్పిటల్స్‌లో ఉన్నప్పుడు రోగులు తమ బంగారు ఆభరణాలను ఇంట్లో లేదా బ్యాంకు లాకర్‌లో భద్ర పరుచుకోవాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.






