శేరిలింగంపల్లి, మార్చి 5 (నమస్తే శేరిలింగంపల్లి): రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు కనీసం రెండు సీట్లు కేటాయించాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ నుండి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలను బీసీలకే కేటాయించాలని అన్నారు. దేశంలో 56 శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో కనీసం 15 శాతం సీట్లు దక్కడం లేదని అన్నారు. బీసీలకు నాయకత్వం కల్పించాలని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. రాజ్యసభలో బీసీలకు సీట్లు కేటాయించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఏఐసిసి ప్రకటించబోతున్న రాజ్యసభ అభ్యర్థుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో ఇద్దరు సమర్థవంతమైన బీసీ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసి సామాజిక న్యాయం చేయాలని అన్నారు. బీసీలకు రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన సామాజిక వైఖరిని ప్రజలకు తెలియజేయాలని అన్నారు.






