- శ్రీ చైతన్య కాలేజీ అనుమతులు రద్దు చేయాలి
- యాజమాన్యం పై కేసు నమోదు చేసి సాత్విక్ తల్లి తండ్రులకు న్యాయం చేయాలి
- అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్ధి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి డిమాండ్

నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజ్‌లో విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్ధి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెబుతున్నారని, సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలిసి కూడా కాలేజీ సిబ్బంది పట్టించుకోకపోవడం అమానవీయ చర్య అని మండిపడ్డారు. తోటి విద్యార్థులే.. ఓ వెహికల్‌ని లిఫ్ట్ అడిగి, సాత్విక్‌ను ఆసుపత్రికి తరలించారని, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే సాత్విక్ మృతిచెందడం బాధాకరమన్నారు. రాష్ట్ర విద్యాశాఖ అసమర్థత వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే శ్రీ చైతన్య నార్సింగి కళాశాల గుర్తింపు రద్దు చేసి, ఆ యాజమన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సాత్విక్ కుటుంబానికి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.