- పౌల్ట్రీ ఉత్పత్తులను ముట్టుకున్నాక చేతులను కడుక్కోవాలి
- మాంసాన్ని బాగా ఉడకబెట్టి తినాలి
- బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపించిన దాఖలాలు లేవు
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): బర్డ్ ఫ్లూ.. దీన్నే ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా అని, ఏవియన్ ఫ్లూ అని పిలుస్తారు. ఇది హెచ్5ఎన్1 వైరస్ వల్ల వస్తుంది. సాధారణంగా చలికాలంలో వలస పక్షులు మన దేశంలోని పలు ప్రాంతాలకు వస్తుంటాయి. వాటిలో ఈ వైరస్ ఉంటుంది. ఈ వైరస్‌ను మొదటగా 1996లో చైనాలోని గువాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఓ బాతులో గుర్తించారు. తరువాత ఆ వైరస్ ఇతర దేశాల్లో పక్షులకు నెమ్మదిగా వ్యాప్తి చెందుతోంది.
ఈ వైరస్ పక్షుల పేగుల్లో ఉంటుంది. కానీ ఆ వైరస్ వల్ల వాటికి ఇన్‌ఫెక్షన్ రాదు. అయితే వైరస్ లో పరివర్తన (మ్యుటేషన్) వస్తే మాత్రం పక్షులకు ఈ వైరస్ వల్ల ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. ఈ వైరస్ బారిన పడిన పక్షుల్లో వాటి ఉమ్మి, మలంలో ఈ వైరస్ ఉంటుంది. ఇది చనిపోయిన పక్షులు లేదా ఇన్‌ఫెక్షన్ బారిన పడిన పక్షుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుంది. వలస వచ్చే పక్షుల్లో ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆ ఇన్‌ఫెక్షన్ కోళ్లు, టర్కీ పక్షుల, బాతులకు సోకితే అవి త్వరగా వైరస్ ప్రభావానికి గురై వెంట వెంటనే చనిపోతాయి.
డిసెంబర్ 27వ తేదీన మన దేశంలోని రాజస్థాన్‌లో ఉన్న జల్వార్ జిల్లాలో ఓ ఆలయం వద్ద 100 కాకులు చనిపోయాయి. దీంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయగా వాటికి ఏవియన్ ఫ్లూ వచ్చినట్లు నిర్దారణ అయింది. ఈ క్రమంలో మన దేశంలో బర్డ్ ఫ్లూ ప్రభావం ఉన్నట్లు ముందుగా అప్పుడు గుర్తించారు. ఆ తరువాత హిమాచల్ ప్రదేశ్లోని పాంగ్ డ్యామ్ సరస్సు వద్ద కొన్ని వలస పక్షులు చనిపోయి కనిపించాయి. అలాగే రాజస్థాన్‌లోని ఓ సరస్సు వద్ద ఉన్న శాంక్చువరీలో 1800 వరకు వలస పక్షులు చనిపోయాయి. దీంతోపాటు కేరళలోని కొట్టాయం, అళప్పుర జిల్లాల్లోనూ అనేక పక్షులు బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయాయి. అలాగే హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లోనూ బర్డ్ ఫ్లూ కేసులను గుర్తించారు. పంజాబ్‌లో పక్షులు చనిపోతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో బర్డ్ ఫ్లూ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
బర్డ్ ఫ్లూ మనుషులకు గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అలాగే ఇన్‌ఫెక్షన్ ఉన్న పక్షిని ముట్టుకున్నా, దాని మాంసాన్ని ముట్టుకున్నా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలో దగ్గు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, ముక్కు నుంచి నీరు కారడం, గొంతు సమస్యలు తదితర లక్షణాలు కనిపిస్తాయి. అయితే బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపించే సందర్భాలు చాలా అరుదుగా ఏర్పడుతుంటాయి.
బర్డ్ ఫ్లూ ఉన్న పక్షులను పూర్తిగా నిర్మూలించడమే ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఏకైక మార్గం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల సంఖ్యలో కోళ్లు, ఇతర పక్షులను ఫాంల నుంచి తొలగిస్తున్నాయి. సామూహికంగా వాటిని పూడ్చిపెడుతున్నారు. కొన్ని చోట్ల కాల్చి వేస్తున్నారు. పక్షులను తీసేందుకు గాను వ్యక్తులు మాస్కులు, పీపీఈ కిట్లను ధరించాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం హర్యానా, కేరళలకు ప్రత్యేక బృందాలను పంపి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. మధ్యప్రదేశ్‌లో పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం విధించారు. కేరళలో పౌల్ట్రీ పక్షులను నిర్మూలిస్తున్నారు. ఢిల్లీలో బర్డ్ ఫ్లూ సహాయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి రాష్ట్రాలకు సహాయం అందిస్తున్నారు. ఐతే ఇటీవలి కాలంలో దేశంలోని పక్షుల్లో మాత్రమే గుర్తించిన బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాప్తి చెందిక పోవడం శుభ పరిణామం. అయినప్పటికీ అప్రమత్తత అవసరం. ముఖ్యంగా మాంసం వండేటప్పుడు జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. మాంసం ముట్టుకున్నాక చేతులను శుభ్రంగా కడగాలి. అలాగే మాంసాన్ని, గుడ్లను బాగా ఉడికించి మరీ తినాలి. దీంతో ఇన్‌ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు.
– డాక్టర్ పి.కల్పన (బీహెచ్ఎంఎస్)
ఎన్ఎఫ్‌సీ ప్యానెల్ డాక్టర్