శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): పాఠశాల ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి స్కూల్ భవనం పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని సెయింట్ మార్టిన్ హై స్కూల్‌లో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న రిజ్వాన్ అహ్మద్ శనివారం పాఠశాల భవనం పైనుంచి కిందకు దూకాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఉద్భవ హాస్పిటల్‌కు తరలించగా అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే రిజ్వాన్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు రిజ్వాన్ అహ్మద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేకే రిజ్వాన్ అహ్మద్ ఆత్మహత్య చేసుకుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

