శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని కానరి ద స్కూల్‌లో సంప్రదాయ పండుగ బోనాల వేడుకలను శోభాయమానంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సహకారంతో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతిని వైభవంగా చాటి చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల అంతటా పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు రంగురంగుల పట్టు దుస్తుల్లో, చీరలు, దుస్తులలో సంప్రదాయ అలంకరణతో పాల్గొన్నారు. చిన్నారులు బోనాలు మోసుకొచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల సందర్భంగా విద్యార్థులచే తెలంగాణ జానపద గీతాలు, ప్రత్యేక నృత్య ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి. మా బోనాల పండుగ అనే చిన్న నాటిక విద్యార్థుల ద్వారా ప్రదర్శించబడి అందరి హృదయాలను హత్తుకుంది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయిని లిడియా క్రిస్టినా మాట్లాడుతూ ఇలాంటి పండుగలు మన సంప్రదాయాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని పిల్లలకు పరిచయం చేస్తాయని, బోనాల వంటి ఉత్సవాలు సమాజంలోని ఐక్యతను, భక్తి శ్రద్ధను పెంపొందిస్తాయని, విద్యతో పాటుగా విలువలు నేర్పడంలో ఈ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. కానరిలో జరిగిన వేడుకలు విద్యార్థులలో తెలంగాణపై గౌరవాన్ని, సమాజంలో సంప్రదాయాలకు కలిగిన విలువలను బలపరుస్తాయన్నారు. బోనాలు అన్నవి కేవలం పండుగ మాత్రమే కాకుండా, ఒక జీవన విధానం అనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందిస్తుందని తెలిపారు.






