ఎకనామికల్ ధరలో ఎలక్ట్రిక్ బైకును రూపొందించిన డెటెల్
నమస్తే శేరిలింగంపల్లి: ఓ వైపు పెట్రోల్ ధరలు సెంచరీకి చేరువలో ఉన్నాయి. ఏ ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేయాలన్నా దాదాపుగా రూ.1 లక్ష ఖర్చు చేయాల్సిందే. ఇటువంటి సంక్లిష్ట సమయంలో రూపాయి ఇందన ఖర్చు లేకుండా కేవలం రూ.20 వేలకే బైకు సొంతం చేసుకోగలిగే అవకాశం ఉంటే అంతకన్నా మంచి ఆఫర్ ఇంకేమైనా ఉంటుందా. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ డెటెల్ ప్రపంచంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం డెటెల్ ఈజీ ప్లస్ ను విడుదల చేసింది. ఈ సంవత్సరం ముంబైలో నిర్వహించే ఆటో షోలో ఈ బైక్ ను ఆవిష్కరించారు. ఏప్రిల్ నెలాఖరులోగా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నామని, మనదేశ రోడ్లపై ప్రయాణానికి ఈ బైక్ అనుకూలంగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలుపుతున్నారు.
గత కొద్ది కాలంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతూ వస్తోంది. పర్యావరణ ప్రేమికులు సైతం ఈ వాహనాల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సైతం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. ఇందన భారం లేకపోవడంతో పాటు తక్కువ ధరలోనే అందుబాటులో ఉండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఈ వాహనాల వాడకానికి ఆసక్తి కనబరుస్తున్నారు. డెటెల్ సంస్థ వ్యవస్థాపకులు యోగేష్ భాటియా మాట్లాడుతూ ఇటీవల ముంబైలో జరిగిన ఆటో షోలో డెటెల్ ఈజీ ప్లస్ ఆవిష్కరించిన అనంతరం దేశ వ్యాప్తంగా యువత నుండి మంచి స్పందన లభించిందని తెలిపారు. అందుబాటు ధరల్లో దేశీయంగా తయారు చేసిన వస్తువులను అందించాలనే లక్ష్యంతో తమ సంస్థ పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుతం రూపొందిస్తున్న మోడళ్లలో 70 శాతం దేశీయంగా రూపొందించిన ఉత్పత్తులనే వాడుతున్నామని, బ్యాటరీ సెల్స్, బిఎంఎస్‌లను మాత్రమే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో నూటికి నూరు శాతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బైక్ లను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
డెటెల్ ఈజీ ప్లస్ విశేషతలు…
ఈ బైకు పూర్తిగా విద్యుత్‌తోనే నడుస్తుంది. దీనిలో 7 కేజీల బరువు గల 20ఎహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 60 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. పూర్తి చార్జింగ్‌కు 5-6 గంటల సమయం పడుతుంది. 5ఎహెచ్ చార్జింగ్ పాయింట్ ద్వారా ఇంటివద్ద చార్జ్ చేసుకోవచ్చు. 350 వాట్ ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో బైక్ నడుస్తుంది. బైక్ గరిష్ట వేగం గంటకు 25కి.మీ.లు. చార్జింగ్ అయిపోయినప్పుడు సైకిల్ మాదిరిగా తొక్కడానికి పేడల్స్ అమర్చారు. గరిష్టంగా 150 కిలోల బరువును మోయగలదు. సాధారణ ద్విచక్రవాహనాల నిర్వహణ ఖర్చులో కేవలం 10శాతం మాత్రమే బైక్ మెయింటెనెన్స్‌కు ఖర్చు అవుతుంది. ఎరుపు, నీలం, పసుపు టీల్ బ్లూ రంగులలో కంపెనీ విడుదల చేయబోతోంది. ఈ బైకు ధరను సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ రూ.20 వేలకు చేరువులో ఉండనున్నట్లు సమాచారం.