నమస్తే శేరిలింగంపల్లి: జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త మహబూబ్ పేట్ విలేజ్ లోని ప్రభుత్వ పాఠశాలలో నులి పురుగుల నిర్మూలనకు మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ బల్దియా స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని చిన్నారులకు మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నిర్ములన దినోత్సవం సందర్భంగా, మియాపూర్ డివిజన్ పరిధిలోని మాక్త మహబూబ్ పేట్ విలేజ్ లోని ప్రభుత్వ పాఠశాలలో 1 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు నులి పురుగులు నివారణకు ఉచిత మందులను పంపిణీ చేశామని, నులి పురుగులు చాలా ప్రమాదకరమైనవి, పిల్లలు అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఎక్కువగా ఆటలు ఆడటం, మల విసర్జన ద్వారా నులి పురుగులు వ్యాప్తిచెందే అవకాశాలున్నాయని అన్నారు. ఈ నులి పురుగుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఉత్తమం అన్నారు. భోజనం చేసే ముందు తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలనీ, పరిశుభ్రమైన నీటిని తాగాలని అన్నారు. పిల్లలందరూ వైద్య నిపుణులు, ఉపాధ్యాయులు చెప్పినవి శ్రద్ధగా విని ఆరోగ్యంగా ఉండలని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిత, రాజు, ఏఎన్ఎం స్వప్న , ఆశా వర్కర్స్ జంగం సుజాత, మానసవీణ, ఆదిలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ రజిత, శానిటేషన్ ఎస్ఎఫ్ఏలు మహేష్ ఆగమయ్య స్థానిక నాయకులు నర్సింగ్ రావు, జంగం మల్లేష్ పాల్గొన్నారు.