నమస్తే శేరిలింగంపల్లి : టీ స్టాల్ నిర్వాహకుడు, అతడి స్నేహితుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ మండలం బోడగట్టు గ్రామానికి చెందిన సాయిలు (33) బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చి బీరంగూడలో భార్య మీన, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అడ్డా కూలీగా జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే గురువారం రాత్రి మియాపూర్ చౌరస్తాలో పనికి మరో ఇద్దరితో కలిసి పనికి వెళ్లాడు.
తెల్లవారుజామున లారీ నుంచి ఇసుకను అన్ లోడ్ చేశారు. పని ఐపోయాక దగ్గరలో ఉన్న టీ స్టాల్ కి వెళ్ళాడు. తన వెంట తెచ్చుకున్న బాటిల్ లో మంచినీళ్ళు పట్టుకుంటుండగా అక్కడ పనిచేసే సతీష్ సాయిలును తోసేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం అక్కడి నుండి సాయిలు వెళ్లిపోయాడు. సతీష్ అంతటితో ఆగకుండా మరో ఇద్దరి సాయంతో సాయిలును బలవంతంగా టీ స్టాల్ దగ్గరకు తీసుకొచ్చి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. సాయులు మృతిపై భయపడ్డ సతీష్ అతని స్నేహితులు సాయిలును మియాపూర్ చౌరస్తాలో లేబర్ అడ్డా మీద పడేసి పారిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సాయిలు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు