నమస్తే శేరిలింగంపల్లి : వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా విధులను నిర్వర్తించాలని శేరిలింగంపల్లి జడ్సీ స్నేహ శభరీష్ ఆదేశించారు. అనునిత్యం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మాన్ సూన్ బృందాలతో జడ్సీ స్నేహ బుధవారం తన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానంగా వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించినందున నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

నాలాల ఆక్రమణలను తొలగించాలని, వర్షపు నీరు ఆటంకం లేకుండా ముందుకు సాగేలా చూడాలన్నారు. నాలాల్లో చెత్త ఇతర వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికపుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు. నీటి నిల్వ ప్రాంతాలలో చర్యలను ఎప్పటికపుడు నివేదించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పలు విభాగాలతో సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.