శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ కులాల బీసీ సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంఘాల నిర్మాణంలో భాగంగా శేరిలింగంపల్లి మహిళా సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు, అడ్వకేట్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన బేరి రామచంద్ర యాదవ్ సమక్షంలో శేరిలింగంపల్లిలో మహిళా సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి సంక్షేమ సంఘ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి మహిళా సంఘం కోఆర్డినేటర్ గా లలితారాణిని నియమించి నియామక పత్రం అందజేశారు. పూర్తిస్థాయి కమిటీ అధ్యక్ష కార్యదర్శులను, సభ్యులను తదుపరి సమావేశంలో నియమిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, అడ్వకేట్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ మహిళలందరూ ముందుకొచ్చి మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకోవడం శుభసూచకమని అన్నారు.
శేరిలింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు, మియాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నర్సింగ్ ముదిరాజ్ మాట్లాడుతూ మన ఐకమత్యమే మనకు బలం అని, 75 సంవత్సరాల స్వాతంత్రంలో మనకు నిర్మాణ లోపం వల్ల ఐకమత్యం లేక ఎక్కడా బీసీలకు న్యాయం జరగలేదని అన్నారు. ఈ తరుణంలో బీసీ లందరూ ఏకమవడం అందులో సగభాగమైన మహిళలు కూడా ముందుకు వచ్చి తమ తమ సంఘాలను బలపరచుకోవడం సంతోషదాయకం అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా న్యాయం కోసం పోరాటం, ఉద్యమం చేయటం తప్పనిసరి అయిందని, రాబోవు లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచి నుండి హైదరాబాద్ మేయర్ వరకు 42% రిజర్వేషన్ కల్పించి తీరాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ మహిళా సంఘాలను ప్రతి కాలనీలో పెట్టాలని బీసీ సంఘాలను ప్రతి ఏరియాలో కూడా మనం నిర్మాణం చేసుకుందామని అన్నారు. అడ్వకేట్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ ఇకముందు శేరిలింగంపల్లి అన్ని బస్తిలలో అన్ని డివిజన్లలో అన్ని కాలనీలలో బీసీ సంక్షేమ సంఘాలు ఏర్పాటు నిర్మాణంలో అందరు సహకరించాలని న్యాయపరంగా తాను అడ్వకేట్ గా ఉన్నందుకు ఏ పనినైనా చేసి పెడతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, సంయుక్త కార్యదర్శి కార్యవర్గ సభ్యుడు అన్నూబాయ్ సింగ్, ఆర్ అనిత, ఎం సునంద, జి నాగమణి, విజయలక్ష్మి, బి శ్రీదేవి, ఎం మమత, సురేఖ పాల్గొన్నారు.