శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 9వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఈ సమ్మెలో కార్మికులు అందరూ పాల్గొనాలని శేరిలింగంపల్లి సిఐటియు కార్యదర్శి కొంగరి కృష్ణ, ఏఐటీయూసీ చందు, దానయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మతోన్మాదులకు అనుకూలంగా పనిచేస్తుందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలకు మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని, కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. శ్రామిక వర్గానికి ఉపాధి లేకుండా చేస్తున్నదని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కానీ పని గంటలు పెంచి కార్మికుల శ్రమను దోచుకుంటుందన్నారు. కనుక 9న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను యావత్తు ప్రజలు సమ్మెలో పాల్గొనాలని వామపక్ష కార్మిక సంఘాలు ఐక్యవేదిక పిలుపుచ్చాయి. ఈ కార్యక్రమంలో తుకారం నాయక్, రాంబాబు, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, రాములు, తదితరులు పాల్గొన్నారు.