శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తుండడం శుభ పరిణామమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే కార్యక్రమంలో భాగంగా తెల్ల రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్క మహిళను స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా చేర్పించడంతోపాటు వారు తీసుకున్న రుణాలకు వడ్డీని జమ చేస్తున్నారు. ఈ కార్యక్రమంపై మహిళలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో జగదీశ్వర్ గౌడ్‌తోపాటు వేముకుంటలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, ఎంఏ నగర్ బస్తీలో కార్పొరేటర్ ఉప్పల పాటి శ్రీకాంత్, హఫీజ్‌పేట బస్తీలో కార్పొరేటర్ పూజిత గౌడ్, గోకుల్ ఫ్లాట్స్ కమ్యూనిటీ హాల్‌లో జగదీశ్వర్ గౌడ్ వేర్వేరుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు బీమా సదుపాయాన్ని సైతం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చందానగర్ సర్కిల్ పరిధిలో కొత్తగా 3782 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటికే 104 సంఘాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






