శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గౌలిదొడ్డి గ్రామం వద్ద ఉన్న బసవతారక నగర్లో సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు జగదీష్, శేరిలింగంపల్లి నాయకుడు కొంగరి కృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కూల్చివేసిన తరుణంలో అప్పుడు ఉన్న పీసీసీ అధ్యక్షుడు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వామపక్షాల నాయకులు ఈ ప్రాంతంలో పర్యటించి స్థానికులకు తాము అండగా ఉంటామని ఆనాడు చెప్పారని తెలిపారు. ఈ తరుణంలో అండగా నిలబడాలని, ఇళ్ల స్థలాల్లో ఇళ్లు కట్టించాలని, రోడ్లు, విద్యుత్, తాగునీరు సదుపాయాలు కల్పించాలని అన్నారు. గుడిసెలను తొలగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పేదలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కులవివక్ష పోరాట సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాష్, రాష్ట్ర వడ్డెర సంఘం నాయకులు జరిపేట సత్యనారాయణ రాజు, అంతయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






