నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో శుక్రవారం నుంచి ఆల్ ఇండియా సారీ మేళా, నవరాత్రి ఉత్సవాలుప్రారంభించనున్నట్లు శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్ రావు పేర్కొన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశం నలుమూలల నుండి 70 మంది ఆర్టిసన్స్ ప్రత్యేకంగా నేసిన చేనేత చీరలు ఈ మేళాలో అందుబాటులో ఉంటాయన్నారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 20 వ తేదీ వరకు ఉదయం 10.౩౦ నుండి రాత్రి 8 గంటల వరకు ఈ మేళా కొనసాగుతుందన్నారు. ధర్మవరం, పోచంపల్లి, కలంకారీ, వేంకటగిరి, టస్సార్, మస్లిన్, లెనిన్, కోట, చిక్కన్ కారి, మదనపల్లి పట్టు, బెంగళూరు సిల్క్, కాంత వర్క్, బెంగాల్ కాటన్, మహేశ్వరం, చందేరి, బనారసీ, గొల్లబామ, చీరాల, తదితర కొత్త కొత్త డిజైన్లతో తయారు చేసిన చీరలతో చేనేతలు రానున్నట్లు తెలిపారు. నవరాత్రి పండగ పురస్కరించుకొని అమ్మవారికి సంబంధించి నృత్య రూపకాలు ప్రముఖ నాట్య గురువులు వారి శిష్య బృందం చే ప్రదర్శనలు ఉంటాయన్నారు. మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో మినిస్ట్రీ అఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్, గవర్నమెంట్ అఫ్ ఇండియా ఆజాది క అమృత్ మహోత్సవాలు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 3 వ తేదీ వరకు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మూడు రోజుల పాటు లైఫ్ అండ్ టైమ్స్ అఫ్ మహాత్మా గాంధీ ఫోటో ఎగ్జిబిషన్, గాంధీ మార్గం నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ అంజయ్య, గుజరాత్ ఇండెక్స్ సి మార్కెటింగ్ మేనేజర్ స్నేహల్ మక్వానా, రీజనల్ అవుట్ రిచ్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు ఉన్నారు.